వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS.
జనం న్యూస్ 29 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ; నేడు పదో తరగతి ఫలితాలు విడుదలవుతున్న తరుణంలో, విద్యార్థుల తల్లిదండ్రులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, IPS కోరారు. ఫలితం ఏదైనా సరే, పిల్లలను ప్రేమతో అక్కున చేర్చుకోవాలని, మార్కులు తక్కువ వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యారని వారిని దండించడం, నిందించడం వంటివి చేయవద్దని తెలిపినారు. పదేళ్ల విద్యా ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని, జీవితానికి ఇది చివరి పరీక్ష కాదని తల్లిదండ్రులు గుర్తించాలని ఎస్పీ పేర్కొన్నారు. తోటి పిల్లలతో పోల్చి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయకుండా, వారికి భరోసానిస్తూ భవిష్యత్తుపై ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పెద్దలందరిపై ఉందని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున, వారి ప్రవర్తనను గమనిస్తూ స్నేహపూర్వకంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఒకవేళ ఆశించిన ఫలితాలు రాకపోతే, కుంగిపోకుండా తిరిగి ప్రయత్నించేలా పిల్లలను ప్రోత్సహించాలని, “ఓటమి గెలుపుకు తొలిమెట్టు” అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలని కోరారు. ఫలితాల ప్రభావంతో పిల్లలు ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు అండగా ఉండాలని, జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తోడ్పాటునందిస్తుందని ఆమె తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా ఉండి, తమ లక్ష్యాల దిశగా ముందడుగు వేయాలని ఎస్పీ ఆకాంక్షించారు.


