Listen to this article

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ✍️ చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక హత్యను ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో వెంటాడి అత్యంత హేయంగా నరికి చంపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాసిన వార్తలే ఈ హత్యకు ప్రేరణగా నిలిచాయని పేర్కొంటూ, నిర్భయంగా వార్తలు రాసే జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే గుర్తించి, వారికి కఠిన శిక్ష పడేలా చూడాలి. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలి,బాధిత విలేకరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.