Listen to this article

భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం
(అంగర వెంకట్) హిందూ సాంప్రదాయ పండుగలలో ముక్కోటి ఏకాదశి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్య కాలానికి ప్రవేశించే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి వాహనంతో మూడు కోట్ల దేవతలతో భూలోకానికి చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు ఆచరించే పూజ,ఉపవాసం వలన మోక్షం లభిస్తుందనేది హిందువుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మండలంలోని వివిధ వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకటలాడాయి. రాయవరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. ఆలయం నందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గోదాదేవి వేషాలు, రాజరాజేశ్వరి కాలనీ వారిచే భజన, గోపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. వెదురుపాక  శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి ఆలయం నందు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలను ఆలయ అర్చకులు అంగర సూర్యనారాయణాచార్యులు,అంగర జనార్ధన చార్యులు ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా మండలంలోని వివిధ రామాలయాల నందు ఏకహాం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.