

జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2019లో సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన ఎర్ర నవీన్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ₹3,00,000 జరిమానా విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు కేసు వివరాలు : జూలై 2019లో, బాధిత బాలిక పెందుర్తిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిందితుడు ఎర్ర నవీన్, తన స్కూల్ స్నేహితురాలైన బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మోసగించి అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. బాధితురాలు పెళ్లి చేసుకోమని నిందితుడిని కోరినా, అతను తిరస్కరించడంతో పాటు అతని తల్లిదండ్రులు కూడా మాకు సంబంధం లేదని చెప్పారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సబ్బవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.దర్యాప్తు & తీర్పు అప్పటి సబ్బవరం ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీలు కుమారస్వామి, మళ్ల మహేష్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణ అనంతరం, విశాఖపట్నం పోక్సో కోర్టు న్యాయమూర్తి జి.ఆనందని, నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ₹3,00,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో 3 నెలల అదనపు సాధారణ జైలు శిక్ష విధించారు.బాధితురాలికి పరిహారం:న్యాయస్థానం, బాధిత బాలికకు ₹10 లక్షల పరిహారం (₹3 లక్షలు నిందితుడి నుండి, ₹7 లక్షలు ప్రభుత్వ తరఫున అందజేయాలని తీర్పు ఇచ్చింది.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఈ కేసును ప్రాధాన్యతనిచ్చి దర్యాప్తు పూర్తి చేసి, నేరాభియోగ పత్రం సమర్పించి, కోర్టులో విచారణ త్వరగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. కోర్టు విచారణను వేగవంతం చేసి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి.ఆర్.మూర్తి వాదనలు వినిపించారు.సబ్బవరం పోలీసులు, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది సమయానికి సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. దీని ద్వారా నిందితుడికి కఠిన శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించిన అధికారులను, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి.ఆర్.మూర్తిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.