జనం న్యూస్ 17: నిజామాబాద్ ఏర్గట్ల మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంఘం నాయకులు, సభ్యులు విశ్వకర్మ భగవానుడికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. విశ్వకర్మ భగవానుడి జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి గొప్పతనాన్ని, సమాజ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణుల పాత్రను సంఘం నాయకులు వివరించారు. విశ్వకర్మ సమాజం ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఏర్గట్ల మండలంలో విశ్వబ్రాహ్మణ కుటుంబాల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. యువత సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు రాజారపు నర్సయ్య ,కోశాధికారి రాజారపు నరేష్ మరియు మండల అధ్యక్షుడు అకునూరి (వడ్ల) గంగాధర్ ,రాజారపు లక్ష్మి నారాయణ, రాజారపు నరహరి పాటు సంఘ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సమాజానికి చెందిన పలువురు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. విశ్వకర్మ జయంతి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.