జనం న్యూస్ 14 నవంబర్ వికారాబాద్ జిల్లా :- భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కంకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసేందుకు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ సేవా సంకల్ప అభియాన్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ పెద్దింటి నవీన్ కుమార్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ సదానంద రెడ్డి, రవీందర్ కంకల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలో దేశభక్తి, సామాజిక స్పృహ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మక రంగాల్లోనూ రాణించి భవిష్యత్తులో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం సేవా సంకల్ప అభియాన్ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్ప మేడం, కంకల్ రవీందర్, కన్నయ్యల రాజు, మనోహర్ గౌడ్, ఆంజనేయులు, నర్సింలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా భావిభారత పౌరుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.