తెలంగాణ

జేఎన్‌టీయూహెచ్‌లో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు.

జేఎన్‌టీయూహెచ్‌లో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు.

శాస్త్రీయ దృక్పథం, విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెంపొందించాలి: వైస్‌ ఛాన్సలర్ డాక్టర్ టి. కిషన్ కుమార్ రెడ్డి జనం న్యూస్ నవంబర్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్)లో భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవాన్ని కూడా పురస్కరించుకుని విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం సమీపంలోని నెహ్రూ విగ్రహానికి వైస్‌ ఛాన్సలర్ డాక్టర్ టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డాక్టర్ ఎ. దామోదరం, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. జయలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతర భారతదేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ పారిశ్రామిక, సాంకేతిక, విద్యారంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులను గుర్తుచేశారు. ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యాసంస్థల స్థాపనలో నెహ్రూ దూరదృష్టి కీలక పాత్ర పోషించిందన్నారు.
విశ్వవిద్యాలయ అభివృద్ధితో పాటు దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని అధికారులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, ప్రశ్నించే తత్వం, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించాలని అధ్యాపకులకు సూచించారు. అలాగే జేఎన్‌టీయూహెచ్‌ను మాదకద్రవ్యాల రహిత క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో బాల్యం నాటి ఆసక్తి, జిజ్ఞాసను కొనసాగిస్తూ జీవితాంతం నూతన విషయాలను నేర్చుకునే అలవాటును పెంపొందించుకోవాలని వైస్‌ ఛాన్సలర్ సూచించారు. విద్య, విజ్ఞానం, క్రమశిక్షణతోనే సమాజం, దేశం మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.

ఇ-పేపర్