

తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు (1974-2025) జనం న్యూస్ 05 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) 25 సంవత్సరాలుగా, ప్రజాక్షేత్రంలో, సామాజిక రంగాలలో, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి, ప్రతిపక్ష, స్వపక్ష పీఏగా, 1500 కి.మీ వారి వెంట పాదయాత్రలో నడిచి, ప్రజా సమస్యల పరిష్కార మార్గంలో, పయనించి వారికి చేదోడు వాదోడుగా ప్రజల మనలను పొంది, ఇటీవల గుండెపోటు తో కన్ను మూయడం అత్యంత విషాదకరం. తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు 1974లో ఖమ్మంలో కీర్తిశేషులు తక్కెళ్ళపల్లి రామస్వామి ప్రమీల ల రెండవ సంతానంగా జన్మించి, ప్రస్తుత పినపాక మండలం ఏడుల్ల బయ్యారంలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి, తదుపరి ఉన్నత చదువులు ఖమ్మంలో పూర్తి చేశారు. అనంతరం ఐసిడిఎస్ లో జూనియర్ అసిస్టెంట్ ,సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తూనే తనతో పాటు పనిచేసే ఉద్యోగస్తులు బాగుకోసం టీఎన్జీవో అప్పటి అవిభక్త ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ గా సేవలందిస్తూ, తెలంగాణ ఉద్యమంలోనూ అత్యంత చురుకైన పాత్రను పోషించారు. ఆ క్రమంలోనే, అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టిలో తను పడటం, అప్పటినుండి, శ్రీనివాసరావు, వారి ప్రతి అడుగుజాడల్లో క్రియాశీలక పాత్రను పోషిస్తూనే అందరి మన్ననలను పొందాడు. డిప్యూటీ సీఎం వారు చనిపోయిన రోజు వారి కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని శ్రీనివాస రావు అంత్యక్రియలకు వచ్చి కంటతడి పెట్టాడు అంటేనే వారి ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా వారు జన్మించిన నాయి బ్రాహ్మణ కుటుంబాలలోని ఉద్యోగస్తులందరినీ ఖమ్మం జిల్లాలో సేకరించి వారి ద్వారా, చదువులలో మంచి ప్రగతిని సాధిస్తూ ఆర్థికంగా వెనుక బాటులో ఉన్న అనేక మంది విద్యార్థులకు, తమ సహకారాన్ని అందించటం, ఆర్థికంగా వెనుకబడిన హాస్పిటల్స్ లో బిల్స్ కట్టలేనటువంటి వారికి సీఎం సహాయ నిధి నుంచి ఇప్పించిన సందర్భాలు అనేకం.
తను పీఏగా నిత్యం బిజీగా ఉన్నప్పటికీ, తనకు వచ్చే ప్రతి కాల్ నీ రిసీవ్ చేసుకుని , వాటి పరిష్కార మార్గంలో ముందుండేవారని , నిగర్వి ,శాంతమూర్తి, చిరునవ్వు చెదిరిపోకుండా ఉండేవారని వారి అంత్యక్రియలకు హాజరైన అనేకమంది అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చర్చించుకుంటుంటే, వారి కుటుంబ సభ్యులు, బంధువుల అర్థానాదాలు గుండెలు పగిలేలా ఉన్నాయి.
శ్రీనివాసరావు బౌతికంగా లేకపోయినా, వారి నిర్వహణలో, వారి సహో ద్యోగులకు, తను పుట్టిన జాతికి, ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలని తను అందించిన సేవలు మరువలేనివి. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగటమే వారికి నిజమైన నివాళి
వ్యాసకర్త డాక్టర్ లింగంపల్లి దయానంద్
సామాజిక కార్యకర్త