Listen to this article

ఆర్ ఆర్ న్యూస్ విలేకరి గట్టేపల్లి రాజశేఖర్ అరెస్ట్ జనం న్యూస్, మార్చ్ 8, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో విలేకరిగా చలామణి అవుతూ అమాయకుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ప్రభుత్వ అధికారులపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్న గట్టేపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని మెట్ పల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కళనగర్ కు చెందిన గట్టేపల్లి రాజశేఖర్ (36) అనే వ్యక్తి గత కొంతకాలంగా విలేకరిగా చెప్పుకుంటూ జీవిస్తున్నాడని ఆర్ ఆర్ న్యూస్ పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఇతర ఆదాయ మార్గాలు లేకపోవడంతో విలేకరి ముసుగులో అమాయక ప్రజలు,వ్యాపారులు, ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడని అన్నారు.వివిధ సమస్యలతో ఉన్న అమాయక ప్రజలను గుర్తించి తాను విలేకరినని పోలీసులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి బాధితుల వద్ద డబ్బులు వసూలు చేసేవాడని,గతంలో ఇలా రెండు మూడుసార్లు మెట్‌పల్లి సీఐ వద్దకు కొందరిని తీసుకెళ్లి పైరవీ చేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నించాడని అన్నారు.సీఐ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించడంతో రాజశేఖర్ సీఐపై కోపం పెంచుకుని గత కొంతకాలంగా తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు.ఈ క్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన రాజేశ్వరరావుపేటలో అక్రమ మొరం రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన ఇరిగేషన్ సబ్-డివిజన్ డీఈఈ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకుని, బ్లాక్ మెయిల్ చేసి రూ. 1,50,000 వసూలు చేసినట్లు రాజశేఖర్ తెలుసుకొని అరుణోదయ్ కుమార్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడని అన్నారు.మార్చి 5, 2025న ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో అరుణోదయ్ కుమార్ ఉన్నాడని సమాచారంతో అక్కడికి వెళ్లిన రాజశేఖర్ అతన్ని బెదిరించి రూ. 1,00,000 డిమాండ్ చేశాడని,డబ్బులు ఇవ్వకపోతే తన న్యూస్‌లో తప్పుడు కథనాలు ప్రచురిస్తానని, చంపేస్తానని బెదిరించడంతో భయపడిన అరుణోదయ్ కుమార్ తన వద్ద ఉన్న రూ. 5,000 రాజశేఖర్‌కు ఇచ్చి, మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడని అన్నారు.ఆ తర్వాత రాజశేఖర్ ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని సీఐ మెట్‌పల్లి,పోలీసుల ప్రతిష్టను దెబ్బతీయాలని భావించి, సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ తన ‘ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ’ అనే వాట్సాప్ గ్రూపులో “ఓ రౌడీ షీటర్… ఇరిగేషన్ అధికారి నుండి అక్షరాల 1,50,000 తీసుకున్న రౌడీ షీటర్… స్థానిక సి.ఐ.కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని సి.ఐ. ఆర్ఆర్ న్యూస్ తెలంగాణకు ఆశ్రయించిన ఇరిగేషన్ అధికారి. సి.ఐ. ఎవరికి అమ్ముడు పోయారు..?” అనే తప్పుడు కథనాన్ని ప్రచురించాడని అన్నారు.ఈ వార్తను చూపి అరుణోదయ్ కుమార్‌ను మళ్లీ బ్లాక్ మెయిల్ చేసి మిగతా డబ్బులు డిమాండ్ చేశాడని అన్నారు.డి ఈ ఈ అరుణోదయ్ కుమార్‌ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు గట్టే పల్లి రాజశేఖర్‌పై ఎస్ ఐ పి. కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి నేడు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని సీఐ ఏ.నిరంజన్ రెడ్డి మీడియాకు తెలిపారు.