Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 2034 నాటికి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత అధికమవుతుంది, వారి గళం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతుంది : పుల్లారావు. స్త్రీమూర్తులను అన్నిరంగాల్లో ముందుంచాలనే సదుద్దేశంతో, గొప్ప ఆలోచనలు చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని, ఐటీ సహా అన్ని కీలక రంగాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలన్నదే ఆయన సంకల్పమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహిళాదినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు అరవిందబాబు, బ్రహ్మరెడ్డి, టీటీడీ సభ్యులు జంగా కృష్ణమూర్తి, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు లతో కలిసి మాజీ మంత్రి ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి కీలక ఉపన్యాసం చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్న గొప్పఆశయంతో చంద్రబాబు పనిచేస్తున్నారని, పారిశ్రామికవేత్తలుగా మహిళలే ముందు నిలవాలన్నది ఆయన కలని మాజీమంత్రి తెలిపారు. స్థానిక సంస్థల వరకే పరిమితమైన మహిళల ప్రాతినిధ్యం 2034 నాటికి చట్టసభల్లోనూ పెరగనుందన్నారు. ఆ సమయానికి చట్టసభల్లో వినిపించే మహిళల గళం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగడం ఖాయమని పుల్లారావు అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులన్నది నా అభిప్రాయమన్న ప్రత్తిపాటి, చంద్రబాబు..కూటమిప్రభుత్వం ఉంటేనే రాష్ట్రానికి, మహిళలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అధికారం దక్కితే చాలు.. అందినకాడికి దోచుకుందాము, ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుందామనే వారి రాజకీయ విషప్రచారాన్ని మహిళలు ఎప్పటికీ నమ్మకూడదని పుల్లారావు సూచించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి, మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికొస్తే..అదే వారికి ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు చేసిన హెచ్చరికను మహిళలు గుర్తించాలన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు క్యూ కడుతున్నాయని, ఆ సంఘాలకు అంత గుర్తింపు, మంచిపేరు రావడానికి కారణం చంద్రబాబేనని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన మహిళల్ని సన్మానించిన నాయకులు, ప్రభుత్వం వారికి అందించిన నగదు ప్రోత్సాహకాన్ని స్వయంగా అందచేశారు.