

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గెడం నగేష్.
జనం న్యూస్ 13 జనవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
జైనూర్ :ఆదివాసీల జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు ఎనలేని కృషి చేసిన హైమన్ డార్ఫ్ ఎలిజిబెత్ దంపతుల సేవలు సదాస్మరణీయమని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గెడం నగేష్ అన్నారు. శనివారం జిల్లాలోని జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ, మార్లవాయి గిరిజన యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హైమన్ డార్ఫ్ ఎలిజిబెత్ దంపతుల 38వ వర్ధంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, సమగ్ర జిల్లా ఎస్. పి. శ్రీనివాస్ రావు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిని కుష్బూ గుప్తా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ అదనపు ఎస్. పి. చిత్తరంజన్ లతో కలిసి హాజరై హైమన్ డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ఆదివాసీల జీవన ప్రమాణాలను పెంచి వారిని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిపేందుకు హైమన్ డార్ఫ్ ఎలిజిబెత్ దంపతులు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. గతంలో 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా తాను పని చేసిన సమయంలో పేసా చట్టం తీసుకురావడంలో సమిష్టిగా పనిచేసి జాతి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేశామని తెలిపారు. పార్టీలకు అతీతంగా జాతి అభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 60 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోని గిరిజనుల హక్కులు, జీవన ప్రమాణాలపై మానవ పర్యావరణ శాస్త్రవేత్తలు హైమన్ డార్ఫ్ బెట్టిఎలిజిబెత్ దంపతులు ఆదివాసీలతో మమేకమై వారి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అలుపెరగకుండా కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికై అనేక కార్యక్రమాలు చేపడుతుందని, విద్య, వైద్య ప్రమాణాలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలను అనుసంధానం చేస్తూ రహదారుల కల్పన, అటవీ భూముల సమస్యలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ఆదివాసీ ప్రాంత యువత ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ నియామకాలలో అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగాలు సాధించి ఈ ప్రాంత గిరిజనుల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని తెలిపారు. మార్లవాయి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ 1940 సంవత్సరంలో ఈ ప్రాంతానికి వచ్చిన హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజిబెత్ దంపతులు ఆదివాసి తెగల అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, భూ సమస్యలు, రహదారుల అనుసంధానం, పాఠశాలల నిర్మాణం ఇతర అనేక అంశాలపై సమగ్ర పరిశోధన చేయడం ద్వారా ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన ఏర్పడి ప్రస్తుతం ఆదివాసీల సమగ్రాభవృద్ధికి మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. అలాంటి మహనీయులు చరిత్రలో మరువలేని స్మరణీయులుగా ఆదివాసీల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నారని, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ తరపున 5 లక్షల 50 వేల రూపాయల నిధులతో బెట్టి ఎలిజిబెత్ పేరిట గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ ఆసిఫాబాద్ ఆదివాసి ప్రాంతాలలో ఎలాంటి సౌకర్యాలు లేని రోజులలో గిరిజన గూడాలలో నివసిస్తూ ఆదివాసీలు ఎదుర్కొంటున్న భూములు, విద్య, వైద్య ఇతర రంగాల సమస్యలపై సమగ్ర విచారణ జరిపి ఆదివాసీల సంక్షేమం పక్షంగా ఆనాటి ప్రభుత్వాలకు నివేదికలు పంపించడం ద్వారా గిరిజనుల సంక్షేమానికి హైమన్ డార్ఫ్ దంపతులు నాంది పలికారని అన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గిరిజన ప్రాంతాలలోని పెర్సా పెన్ దేవాలయాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాలలో రాయి సెంటర్ల భవనాల మంజూరు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల బలోపేతం, నియోజకవర్గాలకు 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతిని పురస్కరించుకొని గత మూడు రోజులుగా నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఐ.టి.డి.ఏ. ఎ.పి.ఓ. మెస్రం మనోహర్, ఈ. ఈ. తానాజీ, మార్లవాయి మాజీ సర్పంచ్ కనక ప్రతిభ, గిరిజన సంఘాల నాయకులు కొడప రాము, విశ్వనాధ్, మెస్రం దుర్గూ పటేల్, రాయి సెంటర్ జిల్లా సర్ మెడి సుదర్శన్, మానవ హక్కుల సంఘం కార్యదర్శి భుజంగరావు, గిరిజన సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.