Listen to this article

జనం న్యూస్,మార్చి15, అచ్యుతాపురం:ఎంఒయు ప్రకారం 60వేల మందికి ఉపాధి కల్పించని బ్రాండిక్స్ కు కేటాయించిన వెయ్యి ఎకరాల్లో వినియోగించని భూమిని వెనక్కి తీసుకోవాలని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు ఆర్.రాము, అచ్యుతాపురం మండల కన్వీనర్ కే. సోమినాయుడు డిమాండ్ చేశారు.ఎకరా రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలు పొందిన బ్రాండిక్స్ యాజమాన్యం ఉపాధి కల్పన, కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయడంలేదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాండిక్స్ పేరుతో వెయ్యి ఎకరాలు పొంది, అధిస్తాన్ గా పేరు ఎందుకు మార్చిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అధిస్తాన్ పేరుతో చేయబోయే ఉత్పత్తుల వివరాలను వెల్లడించాలన్నారు. కారు చౌకగా భూమి తీసుకొని పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించని బ్రాండిక్స్ నుంచి భూమి వెనక్కి తీసుకుని పేద రైతులకు పంపిణీ చేయాలన్నారు.