

జనం న్యూస్ మార్చి 16 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో జామ మసీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇఫ్తార్ విందు అనేది హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తారన్నారు. సోమిరెడ్డి 15సంవత్సరాలుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని, ఎన్నికల్లో 4000 కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఇస్తామని చెప్పి గత బడ్జెట్ లో 3000 కోట్లు పెట్టారన్నారు. అందులో 1000 కోట్లు కూడా ఇప్పటివరకు ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఖర్చుపెట్టిన డబ్బులు కూడా కేసీఆర్ పెట్టిన మైనార్టీ గురుకులాల కోసం మాత్రమే ఇచ్చారని అన్నారు. మైనార్టీ యువకుల కోసం మహిళల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.
షాదీ ముబారక్ ఇప్పటివరకు ఇవ్వలేదని, ఇస్తానన్న తులం బంగారం మాటే లేదన్నారు. ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనం పెంచుతామని చెప్పారు కనీసం కెసిఆర్, ఇచ్చిన గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వడంలేదన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మత ఘర్షణలు జరిగాయని, కెసిఆర్ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫా కూడా ఇవ్వడం మానేసిందని, క్యాబినెట్ లో ఒక మైనార్టీ మినిస్టర్ కు అవకాశం లేదని, మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీలలో కూడా ముస్లిం మైనార్టీలకు చోటు లేదన్నారు. కాంగ్రెస్ చెప్పుకోవడం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటుంది కానీ ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తనకి మోడీకి ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరిచాడన్నారు. 75 కోట్ల ప్రత్యేక నిధులను తెల్లాపూర్ మున్సిపాలిటీకి కేసీఆర్ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్ల నిధులను రద్దు చేసిందన్నారు. ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కేసీఆర్ ఇచ్చిన నిధులను ఎందుకు వెనక్కి తీసుకెళ్లారని ప్రశ్నించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తెల్లాపూర్ లో మంచి ఫంక్షన్ హాల్ కోసం 500 కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చామని 10 కోట్లతో అద్భుతమైన ఫంక్షన్ హాల్ నిర్మించామన్నారు.
తెల్లాపూర్ మున్సిపాలిటీకి వెజ్ నాన్వెజ్ మార్కెట్ మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని,
తెల్లాపూర్ మున్సిపాలిటీకి పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిజిఆర్ ఫౌండర్ గోవర్ధన్ రెడ్డి, పటాన్ చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, 111 డివిజన్ కార్పొరేటర్ హిందూ ఆదర్శ్ రెడ్డి, ఏం డి ఆర్ ఫౌండర్ పృధ్విరాజ్, పలు గ్రామాల సర్పంచులు వార్డ్ మెంబర్లు ,ఆప్షన్ నెంబర్లు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.