

జనం న్యూస్- మార్చి 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనదని సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రధానోపాధ్యా యులు సిస్టర్ లలిత అన్నారు . సోమవారం నందికొండ మునిసిపాలిటీ పరిధిలోని స్థానిక సెయింట్ జోసఫ్ పాఠశాల 2024-25 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు అభినందన సభ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్ధికీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు 10వ తరగతితోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలంటే 10వ తరగతి కీలకమని అన్నారు. 10వ తరగతి తర్వాత ఆ విద్యార్థికి ఉన్నటువంటి ఆకాంక్షను బట్టి ఉన్నత విద్యకు మార్గం ఏర్పడుతుందని ఆ మార్గాన్ని తానే ఎంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆనవాయితీగా పాఠశాల స్థాయిలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి చదువుతూ పాఠశాలను విడిచి వెళ్లే విద్యార్థులను అభినందిస్తూ వీడ్కోలు సభ ఏర్పాటు చేయటం జరుగుతుందని, 10వ తరగతి విద్యార్థులు 9వ తరగతిలో ఉన్న విద్యార్థులకు దిశ, నిర్ధేశం చేస్తూ వీడ్కోలుగా పలికే సందర్భం జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఆశీర్వదించారు.