Listen to this article

ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నా, సీ.ఎం.ఆర్.ఎఫ్ సాయం కోరేవారు పెరగడంపై ప్రభుత్వం ఆలోచించాలి : ప్రత్తిపాటి. చిలకలూరిపేటలో వందపడకల ఆసుపత్రి నిర్మాణాన్ని తక్షణమే పూర్తిచేయాలి : పుల్లారావు జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా వీలైనన్ని వ్యాధులకు చికిత్సతో కూడిన మెరుగైన వైద్యసేవల్ని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిందని, అయినప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సీ.ఎం.ఆర్.ఎఫ్ సాయం కోరడంపై వైద్యారోగ్య శాఖ ఆలోచన చేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర వైద్యరంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాజీమంత్రి మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద వీలైనన్ని ఎక్కువ వ్యాధుల్ని చేర్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో చికిత్సవిధానంలో తలెత్తే సమస్యలవల్లగానీ, కొన్ని వ్యాధుల్ని జాబితాలో చేర్చకపోవడం వల్లగానీ, ఆసుపత్రుల్లో అదనంగా డబ్బులు అడగడం వల్లగానీ, ఇప్పటికీ ప్రజలు ఎక్కువగా సీ.ఎం.ఆర్.ఎఫ్ సాయం కావాలని అడుగుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స చేయించుకోవడానికి వెళ్లే రోగులకు, ఎలాంటి ఆరోగ్యసమస్యకైనా పూర్తిస్థాయిలో రూపాయి ఖర్చులేకుండా నాణ్యమైన వైద్యసేవలు అందేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆసుపత్రుల్లో తమకు ఎదురయ్యే సమస్యలపై రోగుల్ని సంప్రదించి, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. అలానే గుండె, కిడ్నీ ఇతర ప్రధాన అవయవాల శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలకు అందించే సేవలకు కొన్ని ఆసుపత్రులు అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, ఈ సమస్యపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ప్రాణభయంతో ప్రజలు ఆసుపత్రులు అడిగినంత డబ్బు కడుతున్నా కొన్ని ఆసుపత్రుల్లో ప్రజలకు సంతృప్తికరమైన వైద్యసేవలు అందకపోవడం బాధాకరమని పుల్లారావు తెలిపారు. మిగిలిన పనులు పూర్తిచేసి వందపడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలి చిలకలూరిపేటలో 2014-19 మధ్య నాబార్డ్ నిధులతో 100పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని పుల్లారావు తెలిపారు. ఆ ఆసుపత్రి నిర్మాణపనుల్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఇంకా 25శాతం పనులు జరగాల్సి ఉందని, ప్రభుత్వం తక్షణమే నిర్మాణంపై దృష్టి పెట్దాలని ప్రత్తిపాటి కోరారు. ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి, అవసరమైన వైద్యపరికరాలు…సిబ్బందిని కేటాయించి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని మాజీమంత్రి సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరారు.