Listen to this article

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహణ 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై రివ్యూ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జనం న్యూస్ , మార్చి 21, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సజావుగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు.గురువారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా హైదరాబాద్ నుంచి పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాల తరలింపు సమయంలో తప్పనిసరిగా బందోబస్తు ఉండాలని, ఎక్కడ ఎటువంటి లీకేజీ లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగే 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఉందని తెలిపారు.పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో అంతరాయం ఉండవద్దని అన్నారు .విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు .ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది , ఆశా సిబ్బంది, అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లు పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో 10వ పరీక్షలకు 7393 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, వీరి కోసం 41 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని అన్నారు. పరీక్షల నిర్వహించే సిబ్బంది, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లైయింగ్ స్క్వాడ్లకు శిక్షణ అందించామని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, సంబంధిత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.