Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రైతుల ఉద్య‌మాన్ని ప‌ట్టించుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు వామ‌ప‌క్ష‌పార్టీలు, ప్ర‌జా సంఘాల ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న చిల‌క‌లూరిపేట‌:
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) గ్యారంటీకి చట్టబద్ధత కల్పించాలని పంజాబ్‌ సరిహద్దు శంభు, ఖనౌరి ప్రాంతాల్లో సంవత్సరం నుంచి ఏకబిగిన ఆందోళన చేస్తున్న రైతు శిబిరాలను పంజాబ్‌ పోలీసులు బలప్రయోగంతో తొలగించడం దారుణమ‌ని వామ‌ప‌క్ష పార్టీలు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు తీవ్రంగా ఖండించారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిర‌స‌న‌గా సీపీఐ, సీపీఎం,న‌ల్ల‌మ‌డ రైతు సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్ర‌జా సంఘాల ఆధ్వ‌ర్యంలో శ‌నివారం ప‌ట్ట‌ణంలోని ఎన్ఆర్‌టీ సెంట‌ర్‌లో ఉన్న డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ప‌లువురు నాయ‌కులు మాట్లాడుతూ కేంద్ర బృందంతో చర్చల సమయంలో చేపట్టిన ఈ అణచివేత చర్యతో రైతుల, రైతు ఉద్యమాల పట్ల మోడీ ప్రభుత్వ కర్కశ వైఖరి మరోసారి వెల్లడైందన్నారు.. రైతులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడారాలు, ట్రాలీలు, నిర్మాణాలను పోలీసులు జేసీబీలతో నేలమట్టం చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేసి భయోత్పాతాన్ని సృష్టించటం అమానుష‌మన్నారు.
నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన వీరోచిత రైతు పోరాటం ఒక్క మోడీ ప్రభుత్వానికే పరిమితం కాదని, ప్రభుత్వం మద్దతిస్తున్న, ప్రభుత్వానికి మద్దతిస్తున్న కార్పొరేట్లకు, కార్పొరేట్‌ అనుకూల విధానాలను సవాల్‌ చేసిందన్నారు. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా వెళ్తే తీవ్రపరిణామలు తప్పవని హెచ్చరించారు. రైతు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఎం.ఎస్‌ స్వామి నాథన్‌ సిఫార్స్‌ను అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి వేతనం, పని దినాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరారు. కార్య‌క్ర‌మంలో నల్లమల రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్రావు, సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరు బాబురావు, citu కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు,AIYF జిల్లా కార్యదర్శి CPI సుభాని, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల,నాయకులు మూసాబోయిన వెంకటేశ్వర్లు,బొంత నాగేశ్వరరావు,సిపిఎం నాయకులు, సాతులూరు బాబురావు, బి. కోటా నాయక్ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు