

జనం న్యూస్ మార్చ్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సి బాలుర హాస్టల్ లో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ..మార్చి 23 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సభలను జయప్రదం చేయాలని కోరుతూ మన దేశ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మరో స్వతంత్ర పోరాటానికి యువతీ, యువకులు, ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం , ప్రధాని నరేంద్ర మోడీ మతోన్మాద ఫాసిస్టు భావజాలాన్ని ప్రతి మనిషిలో చొప్పించడం కోసం బలవంతపు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మతోన్మాద ఫాసిస్టు భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి మనిషిని అణచివేస్తున్నారు. అర్బన్ నక్సలిజం పేరుతో అమాయకులైన ఆదివాసీలను, గిరిజనులను వందలాది మందిని తమ రక్షణ బలగాల చేత చంపి వేస్తున్నారు. దేశాన్ని, దేశంలో ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాలు, పాలకులు, రక్షణ బలగాలు నక్సలిజం పేరుతో ప్రజలను, ఆదివాసీలను, విద్యార్థులను, యువకులను, మేధావులను సైతం సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధిస్తూ, బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో నిత్యం మరణ హోమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మతోన్మాద ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం, మోడీ, అమిత్ షా ధ్వయం సాగిస్తున్న మారణకాండ కు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో, ఈ దోపిడీ వ్యవస్థను కూల్చివేయడానికి సిద్ధపడాలని అన్నారు. అదే పోరాట స్ఫూర్తితో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 94వ వర్ధంతి వారోత్సవాలను ఈ నెల 23 నుండి 30 వరకు గ్రామ గ్రామాన, జిల్లా వ్యాప్తంగా సభలు జరపాలని భగత్ సింగ్ అందించిన వారసత్వంలో దేశ రక్షణకై పాటుపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా నాయకులు అయ్యుబ్ ఖాన్, హాస్టల్ నాయకులు విష్ణు, అఖిల్, బిమేష్, మహేష్, సాయి తేజ, సుశాంత్, వంశీ, గజానంద్, వెంకటేష్, అఖిల్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.