

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 23 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఆన్లైను బెట్టింగు యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,
ఐపిఎస్ మార్చి 22న పిలుపునిచ్చారు. నేటి నుండి ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆన్లైను, ఆఫ్లైను క్రికెట్ బెట్టింగులకు పాల్పడేవారు, ముఖ్యంగా యువత అప్రమత్తం ఉండాలని, ఆర్ధికంగా జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ల జోలికి పోవద్దని ప్రజలు, యువతను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – బెట్టింగు యాప్ లు వినియోగం వలన ఆర్ధికంగా ఎక్కువగా నష్టం కలిగించి, సాఫీగా సాగిపోతున్న జీవితాలను నాశనం చేస్తాయన్నారు. చిన్న మొత్తాలతో ప్రారంభించిన బెట్టింగులు, ఆశక్తి పెరిగే కొద్ది పెద్ద మొత్తంలో డబ్బులను బెట్టింగుకు పెట్టి, చివరకు ఆర్ధికంగా పెద్ద మొత్తంలో నష్టపోతారన్నారు. బెట్టింగుల్లో ఎదురైన ఓటముల్లో నష్టాన్ని అధిగమించేందుకు మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వలన మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. బెట్టింగు యాప్లను ప్రారంభంలో సరదాగా వినియోగించి, చివరకు వ్యసనంగా మారే పరిస్థితులకు చేరుకొంటారన్నారు. ఒకసారి బెట్టింగులకు అలవాటు పడిన వ్యక్తులు తమ
ఆలోచనలన్నీ బెట్టింగు మీదనే పెట్టి, ఆర్ధిక నష్టాలతో కుటుంబ సభ్యులతో గొడవలకు పాల్పడతారన్నారు. బెట్టింగులకు అలవాటుపడిన వ్యక్తులు కుటుంబ అవసరాలను నిర్లక్ష్యం చేస్తూ, సంపాదనంతా బెట్టింగుల్లోనే పోగొట్టుకొనే ప్రమాదం ఉందన్నారు. బెట్టింగులతో డబ్బులను పోగొట్టుకొని మానసిక ఒత్తిడికి గురవుతారని, నిరాశ, ఆత్మన్యూనత భావాలతో చివరికి ఆత్మహత్యా ప్రయత్నాలకు దారితీస్తాయన్నారు. బెట్టింగులతో నిత్యం సమయాన్ని గడపడం వలన కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరం కావడమే కాకుండా, విలువైన సమయాన్ని వృధా చేస్తూ, అభివృద్ధికి దూరమవుతారని ప్రజలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.
ఈ తరహా బెట్టింగు యాప్లను వినియోగించడం, ఆఫ్ లైను బెట్టింగులకు పాల్పడడం చట్ట విరుద్ధమని,
ఎవరైనా బెట్టింగులకు పాల్పడి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా కేసుల్లో నిందితులపై న్యాయస్థానాల్లో నేరం రుజువైతే జైలు శిక్షలు, పెద్ద మొత్తంలో జరిమానాలు తప్పవన్నారు. కావున, ప్రజలు, ముఖ్యంగా యువత తమ జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ల జోలికి పోవద్దన్నారు. బెట్టింగులతో డబ్బులు సంపాదించవచ్చున్న పేరాశతో బెట్టింగులకు పాల్పడే కంటే ఆర్ధిక భద్రత కోసం కష్టపడి పని చేయడం, న్యాయబద్ధంగా సంపాదించిన నగదును సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమైన మార్గమని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. ఆన్లైను లేదా ఆఫ్లైను బెట్టింగులకు పాల్పడేవారి సమాచారం ఉంటే డయల్ 112/100 లేదా 912109483కి సమాచారం అందించాలని ప్రజలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.