Listen to this article

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :అనకాపల్లిలో జరిగిన ఒక దారుణ ఘటన హిజ్రాల సమాజాన్ని కలచి వేసింది. తమ సామాజిక వర్గాన్ని చెందిన ఒక హిజ్రాపై జరిగిన అమానుషంపై ఆవేదనతో గళమెత్తింది. న్యాయం చేయాలని, తమకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టింది. ఒకడి దుర్మార్గానికి ప్రాణాలు కోల్పోయిన తమ సహచర హిజ్రా ఆత్మకు శాంతి కలగాలని అశ్రు నివాళులర్పించింది. ఈనెల 19న క్రితం అనకాపల్లిలో దీపు అనే హిజ్రాను ఆమెతో సహవాసం చేసే దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. దీపును హత్య చేసి, మృత దేహాన్ని మూడు ముక్కలుగా చేసి, వాటిని వేర్వేరు చోట్లలో పారవేశాడు. అనకాపల్లి సమీపంలోని ఒక ఫ్లై ఓవర్ కింద గోనే సంచిలో వెలుగులోకి వచ్చిన ఒక భాగాన్ని బట్టి, చనిపోయిన వ్యక్తి హిజ్రా దీపుదిగా పోలీసులు కనుగొన్నారు. ఆపై ఆమెను హత్య చేసింది ఆమెతో సహజీవనం చేసే దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించి విచారణ మొదలు పెట్టారు. ఇక దీపు హత్యతో ఉలిక్కి పడ్డ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని హిజ్రాలు అంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అందులో భాగంగా దీపు ఆత్మకు శాంతి కలగాలని విజయనగరంలోని హెల్పింగ్ హాండ్స్ హిజ్రా అసోషియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండబాబు, అధ్యక్ష కార్యదర్శులు దవడ మీనాకుమారి, స్రవంతి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వైఎస్ఆర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుడు దుర్గా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిందితుడికి మద్యంతర బెయిల్ మంజూరు కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మృతురాలు దీపు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి ఏదైనా ఘటన జరిగితే త్వరితగతిన విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ట్రాన్స్ జెండర్లకు అవగాహన కల్పించేలా కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తమపై ఇటువంటి దారుణాలు జరిగినపుడు సమాజంలోని స్త్రీ పురుషుల విషయంలో ఎలాగైతే ప్రభుత్వాలు స్పందిస్తాయో, తమ విషయంలో కూడా అలాగే స్పందించి, తమకు అండగా నిలబడాలని హిజ్రాలంతా కోరారు.