Listen to this article

జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకూ పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కళ నెరవేర్చుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మిగిలిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య ఆరోపించారు.పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయిలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం సీపీఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో మార్క్స్ నగర్ నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కొన్ని డివిజన్లలో ఉన్న లబ్దిదారుల ఇంటి స్థలాలు దరఖాస్తులు మాత్రమే మొదటి విడతగా ఈరోజు తహశీల్దారుకు అందజేయడం జరుగుతుందని ఇంకా మిగతా అన్ని డివిజన్లు నుంచి దరఖాస్తులు కూడా రెండవ విడతలో అందజేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందనే విమర్శలు విన్పిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగలేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇళ్లు కట్టుకునేందుకు సొంత స్థలం ఉన్నవారు చాలా మంది ముందు కొస్తున్నారనీ అన్నారు. గ్రామాల్లో ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. 2014-19 టిడిపి పాలనలోనే ఇదే పరిస్థితి నెలకొంది. తొలుత మూడేళ్లపాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి 2019 ఎన్నికలు దగ్గరపడ్డాయి. టిడిపి ఓటమి పాలైంది. తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గృహనిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలివ్వాలని గతంలో అనేకసార్లు అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. గత ఐదేళ్లు పాలించిన జగన్ రెడ్డి రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు నిర్మిస్తామని రాబోయే కాలంలో ఇంటి స్థలాలు ఇల్లు అడిగే పేదవారు లేకుండా చేస్తానని వాగ్దానం చేసి చేతులెత్తేసాడని ఆరోపించారు. పేదలను మరింత పేదవారిని చేసి గద్దె దిగిపోయాడని విమర్శించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండు సెంట్లు, మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల అని చెప్పి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.ఇళ్ళు, టిడ్కోఇళ్ళను లబ్దిదారులకు పూర్తిగా అప్పగించకుండ నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు పేదలు నివసించే ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, ఎన్.నాగభూషణం, మార్క్స్ నగర్ శాఖ కార్యదర్శి అప్పరుబోతు జగన్నాధం, సహాయ కార్యదర్శి బూర వాసు, శాంతి నగర్ శాఖ సహాయ కార్యదర్శి వెలగాడ రాజేష్, బల్జివీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, ఏఐటీయూసీ నాయకులు పొడుగు రామకృష్ణ, అల్తి మరయ్య మరియు ఇళ్ళ స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్న మహిళలు హజరయ్యారు.