

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 25 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : తాగునీటి సరఫరా పైప్ లైన్లు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేసిన ప్రత్తిపాటి ప్రజల నుంచి తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై ఫిర్యాదులు రాకూడదు : ప్రత్తిపాటి. వేసవి దృష్ట్యా తాగునీరు సక్రమంగా అందేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని, పైపులైన్ల మధ్యలో ఉండే లీకేజ్ లను సరిచేసి, నీటివృథాను అరికట్టి, సురక్షిత నీరు ప్రజలకు అందించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మంగళవారం ఆయన పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ వ్యవస్థను, స్థానిక డంపింగ్ యార్డ్ ను పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలుసూచనలు చేశారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో నీటివినియోగం అధికంగా ఉంటుందని, తాగునీరు అందలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పుల్లారావు స్పష్టం చేశారు. నీటి సరఫరా వ్యవస్థలో ఏవిధమైన సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి పైపులైన్ల పగుళ్లు, ఇతర లీకేజ్ లను వెంటనే సరిచేయాలని, సురక్షితమైన నీరు ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పుల్లారావు తెలిపారు. మురుగునీరు రోడ్లపైకి రాకుండా డ్రైనేజ్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. బ్లీచింగ్, క్లోరినేషన్ ప్రక్రియలు సమయానుగుణంగా జరగాలని, దోమల బెడద లేకుండా ఫాగింగ్ చేయాలని మాజీమంత్రి మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని శారదాహైస్కూల్ పక్కన ఉన్న శ్మశానవాటికను ఆధునికీరించాలని, కంపచెట్లు.. వ్యర్థాలు వీలైనంత త్వరగా తొలగించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పుల్లారావు అధికారుల్ని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ నిర్వహణలో అజాగ్రత్త, అశ్రద్ధ సహించను చెత్త తీసుకొచ్చి పడేశాము… పని అయిపోయిందని భావించకుండా డంపింగ్ యార్డ్ నిర్వహణలో అజాగ్రత్త, అశ్రద్ధ సహించేది లేదని, చెత్తపేరుకుపోకుండా చూడాలని పుల్లారావు అధికారులకు సూచించారు. పొడిచెత్తను రీ సైకిల్ చేయడం, తడి చెత్తను విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తరలించే ప్రక్రియ సజావుగా జరగాలన్నారు. డంపింగ్ యార్డ్ లో చెత్తను తగలబెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమీపంలోని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పుల్లారావు సూచించారు. ముఖ్యంగా ఆకతాయిలు, మందుబాబులు డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల మద్య, ధూమపానం చేయకుండా నిఘా ఉంచాలన్నారు. పనుల పరిశీలనలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ రఫ్ఫాని , మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి , మునిసిపల్ D.E షేక్ రహీం , పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా , పల్నాడు జిల్లా రైతు అధ్యక్షులు వీరారెడ్డి , పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ , జనసేన పార్టీ నాయకులు భాషా పలువురు నాయకులు, వార్డు నాయకులు విచ్చేశారు.