Listen to this article

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చాలి..
రైతులకు అవగాహన కల్పించాలి..
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

జనం న్యూస్ // మార్చ్ // 26 // కుమార్ యాదవ్ (జమ్మికుంట)..


కరీంనగర్ జిల్లాలోని యాసంగి పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులు, అధికారులు సమావేశమైన సందర్భంగా, కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ..ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత మాత్రమే హార్వెస్ట్ చేయాలని రైతులకు, హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ధాన్యం కోతల కోసం రెవెన్యూ గ్రామాల వారీగా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, గన్ని సంచులు, తార్పాలీన్ కవర్లు తదితర అవసరమైన వసతులు ముందుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ప్యాడి క్లీనర్లతో పాటు మరో 15 ప్యాడి క్లీనర్లు కొనుగోలు చేయాలని సూచించారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో 24 గంటల సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు అనంతరం వివరాలను తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకాల ధాన్యాలను వేర్వేరు ప్రదేశాల్లో నిల్వ ఉంచాలని, ఎండాకాలంలో రైతులకు నీడ, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. సిబ్బంది కొనుగోలు రిజిస్టర్‌ను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు, తేమ కొలిచే యంత్రాన్ని నీడలో ఉంచేలా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.