

సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు
ఎండల తీవ్రత దృష్ట్యా తి సుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులు నియంత్రణ ప్రణాళికపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన అదనపు కలెక్టర్
జనం న్యూస్, మార్చి 27, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ దిశగా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సంబంధిత అధికారులకు సూచించారు.బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎండల తీవ్రత దృష్ట్యా చేసుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులు నియంత్రణ ప్రణాళికపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మాట్లాడుతూ, రాష్ట్రం లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతల నమోదు జిల్లాలలో పెద్దపల్లి మూడవ స్థానంలో ఉందని , ప్రజలు వడ గాల్పుల బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ఎండ తీవ్రత వల్ల శరీరంలో నేటి శాతం తక్కువైతే ప్రజలకు వడ దెబ్బ తగిలే అవకాశం అధికంగా ఉంటుందని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం ఉత్తమమని అదనపు కలెక్టర్ తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పనుల పని వేళలు మార్చాలని అన్నారు.ఆశా కార్యకర్తల నుంచి జిల్లా అధికారుల వరకు ప్రతి ఒక్కరి వద్ద అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. జిల్లాలో జరిగే వివిధ పంట కొనుగోలు నేపథ్యంలో రైతులకు, హమాలీ కూలీలకు, అక్కడి సిబ్బందికి వడదెబ్బ తగలకుండా ఏర్పాట్లు ఉండాలని, అవసరమైన టెంట్, త్రాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకేట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. నీటి పారుదల శాఖ, పంచాయతీ, వివిధ శాఖల కింద జరిగే పనులు దగ్గర కార్మికులకు వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని అన్నారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో చల్లి వేంద్రం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. వేసవి కాలంలో వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. వడ గాల్పుల వల్ల వచ్చే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వేసవి కాలంలో ప్రతి రోజు నీరు త్రాగడం, గొడుగు తీసుకుని బయటికి రావడం, వేడి గాల్పులు వచ్చే సమయంలో ఇంట్లో ఉండటం వంటి వివిధ అంశాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో తీసుకోవాలని అదనపు సూచించారు. గతంలో అధికంగా ఫీవర్ కేసులు నమోదైన ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. నీరు నిల్వ ఉండకుండా గుంతలు పూడ్చి వేత కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఇంటిలో పాత కూలర్లు టైర్ల లో నీటి నిల్వలను తీసి వేయాలని అన్నారు. గ్రామాలలో రెగ్యులర్ ఫాగ్గింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.