

ఉన్నత విద్య ప్రయివేటీకరణ దిశగా అడుగులు
రాష్ట్రంలో నిఘా పెంచాలి లోపాలను గుర్తించాలి వాటిని సరిదిద్దాలి
సమాజ నిర్మాణానికి విద్యే పునాది ఆ పునాది బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలి: సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం క 27 మార్చ్ ( జనం న్యూస్ )
హైదరాబాద్ అమెరికాలో ఉన్నత విద్యను ప్రయివేటీకరించిన ఆ దేశ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ బాటలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నత విద్య ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మంగళవారం శాసనసభలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న విద్యార్థులు ఫిన్‌లాండ్‌లో ఉన్నారనీ, స్కాండలేవియన్ దేశాల్లో విద్యా వ్యవస్థ బాగుందని చెప్పారు. స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఫిన్‌లాండ్, నెదర్లాండ్ తదితర దేశాల్లో టీచర్లకు ఐఏఎస్ అధికారుల కంటే ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇస్తారనీ, వారి నుంచి నేర్చుకునే అంశాలను గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో విద్యకు ఖర్చు చేస్తున్నా అందుకు తగ్గ ఫలితాలు రావడం లేదని కూనంనేని సాంబశివరావు తెలిపారు. విద్యావ్యవస్థ బలోపేతానికి నిఘా పెంచి లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని ఆయన కోరారు. సమాజ నిర్మాణానికి విద్యే పునాది అనీ, ఆ పునాది బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పదేండ్ల కాలంలో ప్రాథమిక, ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల సంఖ్య, డ్రాప్ అవుట్స్, పరిణామాలు, వాటి ఫలితాలు, నష్టాలు, కష్టాలు, ఉపయోగాలపై ప్రత్యేకమైన కమిటీతో సమగ్రంగా విచా రణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా లోపాలు బయటపడి, వాటిని సరిదిద్దితే అనేక సమస్యలు పరిష్కార మౌతాయని అభిప్రాయ పడ్డారు. విద్యా రంగంలో ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తున్నా అందుకు తగ్గ ఫలితాలు మాత్రం రావడం లేదని చెప్పారు. విద్యా ప్రమాణాల విషయంలో తెలంగాణ రాష్ట్రం 14వ స్థానంలో ఉందనీ, 9,10వ తరగతుల విద్యార్థుల డ్రాప్ అవుట్స్ 2020-21లో దేశంలో 13.9 శాతం ఉండగా, తెలంగాణలో 22.1 శాతంగా ఉన్నదని విచారం వ్యక్తం చేశారు. కేరళలో వంద శాతం అక్షరాస్యత ఉన్నదనీ, తమిళనాడులో ఐఐటీ, ఎఐఎంలలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్నాయని తెలిపారు. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలో మన పదవ తరగతి విద్యార్థులు ఇతర దేశాలలో చదువుతున్న ఐదవ తరగతి విద్యార్థులతో కూడా సమానంగా ఉండడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్య సంస్థలలో అవసరం మేరకు బోధనా సిబ్బందిని నియమించకుండా, తక్కువ వేతనాలు ఇచ్చేందుకు రకరకాల పేర్లతో ఉపాధ్యాయులను నియమించారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. వీరందరిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వేతనాలను పెంచాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం బెల్టు షాపులను ఎత్తివేయాలనీ, కుదిరితే మద్య నిషేధం విధిస్తే బాగుంటుందని కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. నకిలీ మద్యం, గుండుంబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కల్లును ఒక పరిశ్రమగా గుర్తిస్తే, ఆ కల్లుపై ఆధారపడిన కల్లు గీత కార్మిక కుటుంబాలకు మేలు జరుగుతుందనీ, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సూచించారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల ఎగవేతలు ఎన్ని ఉన్నాయో గుర్తించారా? అని ఆయన ప్రశ్నించారు.