

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం నిబంధనల ప్రకారం సకాలంలో అందించాలి
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్
జనం న్యూస్ , మార్చి 30, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ్రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ , డిసిపి , ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ కే లక్ష్మీనారాయణ, కుత్రం నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. పెద్దపల్లి జిల్లాకు వచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ , సభ్యులను అదనపు కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను అదనపు కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులు శిక్ష వచ్చేలా సాక్ష్యాలను ప్రవేశ పెట్టాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పోలీస్ కేసులకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు కొరకు తహసిల్దార్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఎస్సీ ఎస్టీలకు 100% పని దినాలు కల్పించాలని, వేసవి దృష్ట్యా పని ప్రదేశాలలో చల్లని త్రాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.ప్రభుత్వ శాఖలలో ఎస్సీ ఎస్టీ అధికారులకు రోస్టర్ పాయింట్ ప్రకారం పదోన్నతులు సజావుగా పారదర్శకంగా వచ్చేలా వ్యవహరించాలని కోరారు. ఎస్సీలు హత్యకు గురి కాబడితే చట్టం ప్రకారం వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్, భూమి మంజూరు చేయాలని అన్నారు. గత 5సంవత్సరాలుగా ఎస్సీ హత్య కేసుల్లో అందించిన పరిహర వివరాలు అందించాలని, నెల రోజుల వ్యవధిలో పెండింగ్ పరిహారం, ఉద్యోగం పెన్షన్ మంజూరు చేయాలని అన్నారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సకాలంలో పరిష్కరించాలని, అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుందని అన్నారు.అనంతరం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ,సభ్యులను జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, పెద్దపల్లి, గోదావరిఖని ఏ.సి.పిలు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.