Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 1, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి ఆదేశాలతో, జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలలో పనిచేయుచున్న ఎం.ఎల్.హెచ్.పి. లు ఎండ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, వడదెబ్బ నివారణ పై శనివారం నాడు వివిధ గ్రామాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమంలను నిర్వహించారు. ఈ సంధర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ అధిక ఎండ లో బయటకు వెళ్ళడం వల్ల వచ్చే అనారోగ్య సమస్య ల పై వివరించారు. ఎండ బారిన పడినపుడు వళ్ళు అంతా వేడెక్కి జ్వరం రావడం, మగత గా ఉండడం జరుగుతుంది., దీన్ని హీట్ పైరాక్సియా అంటారు, ఇందులో మనిషి ఉష్ణోగ్రత 102 ఫారాన్ డిగ్రీ ల వరకు ఉంటుంది. ఇది ఎండలో సాధారణ పనులకు వెల్లె వాళ్లకు రావచ్చు. చెమటల ద్వారా నీరు, లవణాలు పోయి మనిషి అలసట చెందుతాడు దీన్ని హీట్ ఎక్సాస్టెన్ అని అంటారు. ఇది ఎండలో పొలం పనులు, వేడిలో వంటి ఇంట్లొ పని చేసే వారికి రావచ్చు. గనులలో, వేడి యందు కండరాలను ఉపయోగించి కష్టమైన పని చేసే వారికి కండరాలన్ని పట్టేస్తాయి దీన్ని హీట్ క్రాంప్ అని అంటారు. ఎండ వడ, వడ గాలి సోకడం వల్ల మనిషి ఉష్ణోగ్రత 110 ఫారన్ డిగ్రీ ల వరకు పెరగ వచ్చు. దీన్ని హీట్ స్ట్రోక్ ( వడ దెబ్బ ) అని అంటారు. ఇందులో తీవ్ర మైన తలనొప్పి, నాలుక తడి ఆరడం, తీవ్ర మైన దాహం, కళ్ళు గుంజడం, తల తిరగడం జరుగు తుంది. వాంతులు, విరోచనాలు కావచ్చు. అందువల్ల నీరు, లవణాలను కోల్పోతాడు. కనీసం ఈ స్టేజ్ లో నైనా గుర్తించి చికిత్స అందించాలి. లేకుంటే తరువాత మగత లోకి వెళ్ళిపోవచ్చు మరియు ప్రాణాపాయం జరుగ వచ్చు. మిలటరీ జవాన్లు, ట్రాఫిక్ పోలీస్ వారు, ప్రేయర్ లో చాలా సేపు ఎండ లో నిలబడి వుండే విద్యార్థులు ఆకస్మికంగా క్రింద పడి పోతారు. దీన్ని హీట్ సింకోప్ అని అంటారు. ఇందులో శరీరం వేడి అయి పోయి రక్త నాళాలు వెడల్పు కావడం వల్ల రక్తం అంతా కాళ్లలోకి వెళ్ళుతుంది దాని వల్ల మెదడు కు రక్త సరఫరా సరిగా కాక కళ్ళు తిరుగడం, శరీరం తనను తాను కాపాడు కోవడానికి ఒక రక్షణ చర్యగా, క్రింద పడి పోతారు. అపుడు ఆ వ్యక్తి ని కూర్చో పెట్టవద్దు, నిలబెట్టి ప్రయత్నం చేయవద్దు. పడుకొన్న పొజిషన్ లోనే కాలు కొద్దిగా పైకి లేపి నీడవున్న, చల్లని ప్రాంతానికి తీసుకెళ్ళాలి. కాళ్లు అలానే పైకి ఎత్తి పెట్టి ఉంచాలి. చల్లని నీటిలో క్లాత్ ముంచి శరీరం అంతా తుడువాలి. ఆ విధంగా శరీర ఉష్ణోగ్రత ను తగ్గించాలి. గాలి ధారాళంగా వచ్చునట్లు చూడాలి. త్రాగినన్ని నీళ్లు తాగించాలి. అపుడు కూడా లేవలేని స్థితిలో ఉంటే ఓ. ఆర్. ఎస్. ద్రావణాన్ని తాగించాలి. ( వాంతులు విరోచనం అయిన వారికి ఇతర ద్రవ పదార్థాల తో పాటు తప్పనిసరిగా ఓ.ఆర్.ఎస్. త్రాగించాలి, మిగిలిన వారు త్రాగినా, త్రాగకున్నా ఏమి లేదు) తరువాత కోలుకోకుంటే, పడుకున్న స్థితిలోనే దగ్గరలో నున్న ఆరోగ్య కేంద్రం కు తరలించాలి. ఎండ వడ త్రాకిన వారిని పడుకున్న స్థితిలో, కళ్ళు పైకి లేపి వుంచి చల్లని ప్రదేశం కు తరలించడం, గాలి తగునట్లు చేయాలి, కూలర్, ఏ. సి. వుంటే పెట్టి శరీరం వేడి తగ్గేలా చేయాలి. తాగినంత నీరు ఇవ్వాలి, ఇతర ద్రవ పదార్థాలు ఇవ్వాలి అని అన్నారు. తలపై చల్లని నీటిలో ముంచిన గుడ్డను వేయాలి. శరీరం అంతా తడి గుడ్డతో తుడవాలి. ఇంకా అవసరం అయితే చల్లని నీరు శరీరం పైన పోసి శరీరాన్ని చల్ల పరుచాలి. నీరు తాగించాలి. మజ్జిగా , గంజి, నిమ్మరసం లాంటి ద్రవ పదార్థాలు తాగించాలి. కొలుకోకుంటే దగ్గరి లోని ఆసుపత్రికి తరలించాలి.ఈ ఎండా కాలంలో ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి — ఎండలో బయటకు వెళ్లకూడదు. ఎండ రాకముందే పనులు పూర్తి చేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదు. ప్రయాణాలు మానుకోవాలి. తప్పనిసరి అయితే ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. బయటకు వెళ్లినపుడు త్రాగు నీరు తీసుకెళ్ళాలి. చల్లని నీరు అనగా రంజన్ ల నీళ్ళు త్రాగాలి, ఐస్ నీరు అవసరం లేదు. వేడి నీరు తాగితే, బయటి వాతవరణం లోని వేడికి తోడు వేడి నీరు తోడై వాంతులు, విరోచనంలు కావచ్చు. అపుడు డీహైడ్రేషన్ కావచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా బయటకు వెళ్లి నప్పుడు కాటన్ గుడ్డ తలకు చుట్టుకోవాలి, గొడుగు లేదా టోపీని ధరించాలి అని అన్నారు. కాళ్లకు చెప్పులు వేసి కోవాలి. గాలి బాగా తగులుటకు పలుచని, వదలుగా వుండే నూలు దుస్తులను వేసుకోవాలి. ఈ దుస్తులు పూర్తిగా శరీరం ను కప్పి వుండాలి. దాని వల్ల ప్రత్యక్షంగా సూర్య కిరణాలు శరీరం పై పడకుంటా ఉంటాయి. ఎర్రని దద్దులు రాకుండా ఉంటాయి అని అన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రజలు ఎండ అధికంగా వున్న సమయంలో ద్వి చక్ర వాహనం పై ప్రయాణం చేయరాదు. ఎండ, వడ గాలి సోకడం వల్ల వడదెబ్బ కు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పని సరి అయిన చో బస్సుల్లో, రైలుల్లో ప్రయాణాలు చేయడం మంచిది అని అన్నారు. నిమ్మరసం, మజ్జిగ, లస్సీ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. గంజి, పప్పు నీరు తాగితే మంచిది. మసాలా, ఆయిల్, వేపుడు ఆహారాలు తినకూడదు. కీర దోస, కర్భుజా, పుచ్చ పండు లాంటి ద్రవములు అధికంగా వుండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.ఐస్ ఫ్రూట్స్, ఫ్రీజ్ లో వుంచిన పెప్సికో లాంటివి తిన కూడదు. ఇవి కలుషిత మైన నీరు , అపరిశుభ్రమైన వాతవరణంలో తయారు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వీటివల్ల హెపటైటిస్ ( పసిరికలు) వచ్చే అవకాశముంది. అందుకే పిల్లలకు ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసి ఇవ్వడం చాలా మంచిది. ద్రవ రూపంలో దొరికే ఆహార పదార్థాలు సాంబారు, మజ్జిగ ఎక్కువ వాడాలి. వేడి వేడి ద్రవాలు టీ, కాఫీ లు ఎక్కువగా తీసుకోకూడదు అని అన్నారు.ఓ. ఆర్. ఎస్. పాకెట్స్ లను గ్రామ పంచాయితీ , రేషన్ షాపు లలో, పనికి ఆహారం క్రింద పనిచేసే చోట, మార్కెట్ యార్డులలో, పి. హెచ్. సి.లలో సబ్ సెంటరు లలో, అంగన్ వాడి కేంద్రం లలో, ఆశల వద్ద అందుబాటు లో ఉంచడం జరిగినదని అని అన్నారు.ఈ వడదెబ్బ ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో ఎక్కువగా వచ్చేఅవకాశం ఉంది కాబట్టి వారిని ఎండలోకి వెళ్ళనీయ కూడదు. పిల్లలు ఇంట్లోనే ఆడుకునే ఏర్పాటు చేయాలి అని అన్నారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఎండ వడ బారిన పడకుండా ఉండాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి పెద్దపల్లి.