Listen to this article

సిలిండర్ పై యధావిధిగా రూ.50 అదనపు వసూలు చేసినా పట్టించుకోని అధికారులు

జనం న్యూస్,మార్చి31, అచ్యుతాపురం: వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొందరు డీలర్లు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అదనపు వసూళ్లతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గ్యాస్ ఏజెన్సీ నుంచి ఐదుకిలోమీటర్ల దూరం వరకూ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని,5 కిలో మీటర్ల నుంచి 15 కి.మీ దూరానికి రూ.20, 15 కిలోమీటర్లు దాటితే రూ. 30 మాత్రమే తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం వ్యాప్తంగా గ్యాస్ సీలిండర్లు డోర్ డెలివరీ రవాణా చార్జీల పేరుతో రసీదులో చూపిన డబ్బులు కంటే అధిక వసూలు చేస్తున్నారని, సీలిండర్లు వినియోగదారుల ఇంటికి సకాలంలో అందించడం లేదని,గ్యాస్ సేఫ్టీ చెకింగ్ చేయకుండా డబ్బులు తీసుకుని చెక్ చేసినట్లు రసీదులు రాసి ఇచ్చారని,ఏజెన్సీ పాయింట్ దగ్గరకు వెళ్లి సీలిండర్లు తీసుకున్నా రూ.50 అధికంగా వసూలు చేస్తున్నారని పలు అంశాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు సిఎస్ఆర్ఐ,వీఆర్వో సమక్షంలో వినియోగదారులు మరియు గ్యాస్ ఏజెన్సీల వారితో రెండుసార్లు విచారణ చేపట్టినా విచారణ రిపోర్ట్ లో ఏమి రాశారో ఇప్పటి వరకు తెలియలేదని, విచారణ జరిపిన తర్వాత కూడా గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలు పాటించడం లేదని సంబంధిత అధికారులకు తెలిసినా ఏమి పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పై రూ.50 అదనపు వసూలు యధావిధిగా కొనసాగుతూనే ఉందని అప్న ఇండెన్ పరవాడ, భారతి కృపా అనకాపల్లి,రాంబిల్లి శ్రీరామచంద్ర హెచ్పి గ్యాస్ ఏజన్సీల పై తగు చర్యలు తీసుకోవాలని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు.