Listen to this article

జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

అవయవ దాతలకు మరణం ఉండదని,మరణించిన తర్వాత అవయవాలను అగ్నికి ఆహుతి చేయడం కంటే, బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత వారి అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తే మరి కొంతమందికి ప్రాణం పోసిన వారు అవుతారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.జనవిజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల అభినందన సభ సోమవారం స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాల రీత్యా ఎవరైనా మరణిస్తే వారి అవయవాలను దానం చేయడం వల్ల మరి కొంత మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.అవయవ దాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని తెలిపారు.విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ అవయవాలు దానం చేయడం ఒక బృహత్తరమైన కార్యక్రమమని తెలిపారు.అవయవ దానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వెంకటరమణ ఆసుపత్రి అధినేత డాక్టర్ చిట్టి రమణారావు మాట్లాడుతూ అవయవదానాన్ని మించిన దానం లేదని,అవయవ దానం చేస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడువచ్చని అన్నారు.సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, అఖిలభారత అవయవదాతల సంఘ వ్యవస్థాపకురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ అవయవ దానం చేసే వారికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు. అదేవిధంగా అవయవదానం చేసే వారిని కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.అనంతరం అవయవ దానం చేసిన పాచిపెంట మండలం కొత్తవలస గ్రామానికి చెందిన లంకేనా సాయి, గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి సాయి పల్లవి తల్లిదండ్రులను ఈ సందర్భంగా సత్కరించారు.జనవిజ్ఞాన వేదిక జిల్లా,నగర అధ్యక్షులు ఎరుకొండ ఆనంద్,షిణగం శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎం.వి.ఆర్ కృష్ణాజి,జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు,జిల్లా కార్యదర్శి యు.శాంతి కుమారి, డప్పు శ్రీను,జెవివి నాయకులు కర్రి సత్యనారాయణ,రాజగోపాల్, షణ్ముఖరావు, సుంకర సూర్యనారాయణ,శీరాపు శ్రీను, డాక్టర్ పైల రమేష్,గెద్ద చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు