

జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి.
జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో గల పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో, లబ్దిదారులకు సజావుగా బియ్యం పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు. 23, 31 నెంబర్ రేషన్ షాపులను సందర్శించి, బియ్యం పంపిణీ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలలోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం నిల్వలు కేటాయించబడ్డాయా అని ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది, ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంతరాలు తావులేకుండా సజావుగా బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని రేషన్ డీలర్లు సంధ్యారాణి, గంగామణిలను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.