

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 2 :
పదో తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి.మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట పరీక్ష కేంద్రంలో మూల పోచారం, తిమ్మారావుపేట, బురద రాఘవాపురం, సెయింట్ మేరీస్ పాఠశాలల నుండి మొత్తం 64 మంది విద్యార్థులు హాజరైనారు. ఏన్కూర్ పరీక్ష కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జన్నారం,ఏపీఆర్ఎస్ ఏన్కూర్, కేజీబీవీ, గుడ్ న్యూస్ స్కూల్, ఏన్కూర్ హైస్కూల్ నుండి 203 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఏన్కూర్ మండలంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పరీక్ష కేంద్రాలలో 267 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరైనారు. పరీక్షల నిర్వహణ కేంద్రాలలో విద్యార్థులకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్లు ఆయా సెంటర్ల చీఫ్ సూపరెండెంట్లు జి.నాగరాజు, శుభాషిణి తెలిపారు.పరీక్షలు మొదలైనప్పటి నుండి ఎటువంటి సంఘటన చోటు చేసుకోకుండా ముగియటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి జీవితంలో తొలిమెట్టుగా చెప్పుకునే పదో తరగతి పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థుల ఆనందాలకు అవధులు లేకుండా పోయింది.పరీక్ష కేంద్రాల నుండి బయటకు వస్తూ ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. 10వ తరగతి పూర్తి చేసుకుని ఎవరి ఇంటికి వారు వెళుతున్న తరుణంలో ఒకరికొకరు ఆలింగనం చేసుకొని వీడ్కోలు చెప్పుకున్నారు.