

ఇల్లంతకుంట సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకోవాలి..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // జమ్మికుంట // కుమార్ యాదవ్..
రెండో భద్రాదిగా ఖ్యాతి గాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారాముల ఆలయంలో ఈ నెల 6వ తేదీ, ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. కార్యక్రమం ఘనంగా జరిగేందుకు హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, అధికారులను సమన్వయం చేసి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ నేపథ్యంలో బుధవారం ఇల్లందకుంటలో జిల్లా కలెక్టర్, మరియు పోలీస్ కమీషనర్, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ,కళ్యాణ మహోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఈ పవిత్ర కార్యానికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలి, స్వామివారి భక్తి సేవలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు.కళ్యాణానికి 30,000 – 40,000 మంది భక్తులు హాజరవుతారని, వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా తాగునీటి సరఫరా, శానిటేషన్, మెడికల్ క్యాంప్ వంటి ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఏ చిన్న అంతరాయం కూడా కలగకూడదని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు స్థానిక మిల్లర్లు సహాయ సహకారాలు అందించాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్క పార్టీ సహకరించాలని, ఆలయ పరిసరాల్లో ఏ రాజకీయ ఫ్లెక్సీలు పెట్టకూడదని స్పష్టం చేశారు.తలంబ్రాలు మరియు ఆలయ నిధుల వినియోగం పూర్తిగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో జరగాలని, జిల్లాకు ముగ్గురు మంత్రుల్లో ఎవరు వచ్చినా తాను వారితో కలిసి పాల్గొంటానని తెలిపారు.
కేసీఆర్ హయాంలో శ్రీరామ నవమి కోసం కలెక్టర్ అకౌంట్ నుంచి రూ. 10 లక్షలు కేటాయించేవారని, అదే విధంగా ఈ ఏడాది కూడా ఆ నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం, ఏసీపీ శ్రీనివాస్ జి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆలయ ఇంచార్జ్ ఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం విజయవంతంగా జరిపేందుకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు.

