Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్

జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో 2022 సం.లో నమోదైన హత్య కేసులో నిందితుడు కొత్తవలస మండలం అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నాగరాజు (32 సం.లు)కు జీవిత ఖైదు, రూ.1000/- లు జరిమాన విధిస్తూ ఏప్రిల్ 3న డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ శ్రీ బి.కళ్యాణ్ చక్రవర్తి గారు తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు ఏప్రిల్ 3న తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే.. కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడిమెరక గ్రామానికి చెందిన జోడీ నాగరాజు తన భార్య లక్ష్మీ కనిపించడం లేదని 2022 సం.లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. విచారణలో ఫిర్యాది/నిందితుడు అయిన జోడు నాగరాజు తన భార్య అయిన జోడు లక్ష్మీని హత్య చేసి, పెట్రోల్ పోసి కాల్చివేసి, తిరిగి తన భార్య అదృశ్యం అయినట్లుగా ఫిర్యాదు చేసినట్లుగా నిర్ధారణ అయ్యిందన్నారు. నిందితుడిని, అతడికి సహకరించిన మౌనిక ను అప్పటి కొత్తవలస సిఐ బాలసూర్యారావు అరెస్టు చేసి రిమాండుకు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారన్నారు.
ఈ కేసులో నిందితుడి పై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు సాక్షులను ప్రవేశ పెట్టడంతో (A-1) జోడు నాగరాజు పై నేరారోపణలు రుజువు కాగా, A-2 మౌనికపై నేరారోపణలు రుజువు కాలేదన్నారు. ఈ కేసులో పోలీసు వారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ సక్రమంగా జరిపించుటలో ప్రస్తుతం పని చేస్తున్న కొత్తవలస సిఐ సీహెచ్.షణ్ముఖ రావు ఆధ్వర్యంలో CMS SI పి.ఈశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్ ఎర్నినాయుడు సాక్షులను సకాలంలో ప్రవేశ పెట్టారన్నారు.
నింది తుడికి శిక్ష పడడంలో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పి వకుల్ జిందల్ అభినందించారు.