Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 4 (ముమ్మిడివరం ప్రతినిధి)


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్యుల సంఘం సర్వ సర్వసభ్య సమావేశంలో శివరాముడి విజ్ఞప్తి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవైశ్యుల ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల సంఘీయులు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి చర్యలు సరికావని ఆర్యవైశ్య ప్రముఖుడు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శిఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్యవైశ్య హాస్టల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు (బాబి) అధ్యక్షతన గురువారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు ఆర్యవైశ్య పెద్దలు మాట్లాడుతూ ఇటీవల కొంతమంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా విభజన చేసి మూడు కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. ఉమ్మడిగా ఉన్న ఆర్యవైశ్య మహాసభను ఆర్యవైశ్యుల ఐక్యతను, గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఇటువంటి ప్రయత్నాలను ఖండిస్తూ శివరామ సుబ్రహ్మణ్యం నాయకత్వాన్ని బలపరుస్తూ చీలిక వర్గాలకు హెచ్చరిక దిశగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, అర్యవైశ్యుల ఐక్యత, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం తాను ఎన్నో త్యాగాలను చేశానన్నారు. సొంత సామాజిక వర్గాన్ని నష్టపరిచే చర్యలు తాను ఏనాడు తీసుకోలేదన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని ఆత్మగౌరవం ముఖ్యమని, ఆర్యవైశ్యులకు నిరంతరం అందుబాటులోనే ఉన్నానన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉన్నారని, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని, రాష్ట్ర మహాసభను ఉమ్మడి జిల్లాలలో విభజించే కుట్రదారుల చర్యలను ఆర్యవైశ్యులందరూ సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. చీలికదారులు కూడా త్వరలోనే వారి తప్పును తెలుసుకుంటారన్నారు. వైశ్య హాస్టల్లో ఒక ఫ్లోర్ను ఉమ్మడి సంఘానికి కేటాయిస్తున్నట్లు శివరాముడు తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాబి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవైశ్యల అభివృద్ధికి, వారి సంక్షేమానికి తాను నిబద్ధతగా 12 పథకాలతో త్వరలో ముందుకు వస్తున్నట్లు తెలిపారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తామంతా శివరాముడి నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. చీలిక వర్గాల ప్రలోభాలకు ఆర్యవైశ్యులు దూరంగా ఉండాలని కోరారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు మాజీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఇంతవరకు ఉమ్మడిగా ఉన్న ఆర్యవైశ్య సంఘాన్ని, మహాసభను చీల్చే కుట్రలను చేధించాలని, ఇలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాము శివరాముడి నాయకత్వంలో పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు