

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
బొప్పూడి ప్రజల మనోభావాలను గౌరవించి రహదారి నిర్మాణం చేపట్టండి : ప్రత్తిపాటి.
గ్రామస్తులు, రైతుల సమస్యల్ని గతప్రభుత్వం పట్టించుకోలేదు : పుల్లారావు
కూటమిప్రభుత్వం జాతీయరహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రరూపురేఖలు మారిపోయేలా నిర్మిస్తున్న ప్రధాన రహదారులు ఏపీ అభివృద్ధికి బాటలు వేయనున్నాయని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అదే సమయంలో రహదారి నిర్మాణం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం కలగకూడదన్నారు. రహదారి నిర్మాణ అలైన్ మెంట్ తో ఏర్పడిన పలు సమస్యల పరిష్కారంపై మాజీమంత్రి ప్రత్తిపాటి జాతీయరహదారి విభాగం అధికారులతో శుక్రవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రా, తెలంగాణను అనుసంధానిస్తూ నిజాంపట్నం ఓడరేవు-పిడుగురాళ్ల హైవే పనుల్లో చిన్నచిన్న మార్పులు చేయడం ద్వారా నియోజకవర్గంలోని బొప్పూడి గ్రామస్తుల మనోభావాలను కాపాడినట్టు అవుతుందని ప్రత్తిపాటి నేషనల్ హైవే అధికారులకు తెలియచేశారు. నిజాంపట్నం ఓడరేవు జాతీయ రహదారి అలైన్ మెంట్, చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామ గుడి, మసీదులు తొలగించేలా ఉన్నందున గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రహదారి అలైన్ మెంట్ మార్పు ఒక్కటే పరిష్కారమని, అధికారులు గ్రామస్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రత్తిపాటి సూచించారు. అదేవిధంగా కోమటినేనివారిపాలెం-గంగన్నపాలెం గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే ఓవర్ హెడ్ ట్యాంక్, సమీపంలోని గుడి తొలగించకుండా రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రత్తిపాటి సూచించారు. ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా పనిచేయడం ఎవరికీ మంచిదికాదన్నారు. గతప్రభుత్వం గ్రామస్తుల అభిప్రాయాలు.. సమస్యల్ని పట్టించుకోలేదని, దానివల్లవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండానే రహదారి నిర్మాణం : పీడీ సంజీవరాయుడు ప్రజలకు ఇబ్బంది లేకుండానే రహదారి నిర్మాణం చేపడతామని, ఎక్కడా ఎలాంటి సమస్యలు రానివ్వమని, పీడీ సంజీవరాయుడు ఎమ్మెల్యే ప్రత్తిపాటికి తెలియచేశారు. బొప్పూడి సమీపంలోని గుడి, మసీద్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారి నిర్మిస్తామని పీడీ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పీడీ ప్రకటనపై ఆయాగ్రామాల ప్రజలు ఎమ్మెల్యే ఎదుటే హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి మా సమస్య కూడా వినలేదు : బొప్పూడి గ్రామస్తులు జాతీయ రహదారి నిర్మాణం వల్ల తమ గ్రామంలోని గుడి, మసీద్ లేకుండా పోతాయనే ఆందోళనతో, తమ సమస్యను గతప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వారి దృష్టికి తీసుకెళ్లడానికి తాముచేసిన ప్రయత్నాలు ఫలించలేదని బొప్పూడి గ్రామస్తులు తెలిపారు. ఆనాడు తమసమస్య వినడానికి కూడా అప్పటి మంత్రి ఇష్టపడలేదని, ఎన్నిసార్లు ఆమెను కలవడానికి వచ్చినా తమకు నిరాశే ఎదురైందని వారు ప్రతిపాటి ఎదుట వాపోయారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి చొరవతో సమస్యకు పరిష్కారం లభించడం తమకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని బొప్పూడి గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జవ్వాజి మధన్ మోహన్, అంబటి సొంబాబు, అమీర్ జాన్, సర్పంచ్ రమేష్, గుంటూ హరిబాబు, గుంటూ కోటేశ్వరరావు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.