


ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలి
బస్టాండ్ సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 06, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుని వెళ్లాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణు, తో కలిసి ల్గొన్నారు. బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి, సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఉన్నత జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని కలెక్టర్ తెలిపారు.చిన్నతనంలో పాఠశాలలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ళ వయస్సులో శాసన మండలి సభ్యునిగా, 1937 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి గా పని చేశారని, స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని తెలిపారు.కార్మిక శాఖ మంత్రిగా పని చేసే సమయంలో కనీస వేతనం చట్టం తీసుకొని వచ్చారని, ఆహార సంక్షోభ సమయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకొని హరిత విప్లవం తీసుకుని వచ్చారని, రైల్వే శాఖ మంత్రిగా అత్యధిక కిలో మీటర్లు రైల్వే లైన్ వేసారని, 1971 లో ఇందిరా గాంధీ నాయకత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బంగ్లాదేశ్ ఏర్పాటు లో కీలకపాత్ర పోషించారని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం చిన్నతనం నుంచే ఆయన కృషి చేశారని, అనేక ఒడిదుడుకులలో కూడా తట్టుకొని నిలబడి ఉద్యమాన్ని కొనసాగించారని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా అమలు చేస్తుంద ని, పరిపాలనలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరిస్తూ అర్హులందరికీ పథకాల ద్వారా లబ్ధి చేయడానికి ఇలాంటి వేదికల ద్వారా అందించే ఫీడ్ బ్యాక్ దోహద పడుతుందని కలెక్టర్ తెలిపారు.బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల జీవితాలు నుండి మనమంతా స్ఫూర్తి పొంది మంచి సమాజం రూపోందించే దిశలో ప్రయాణం సాగించాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని, అతి చిన్నవారైనందున బేబీ మినిస్టర్ గా పిలవబడే వారని, రాజకీయాల్లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా, సుదీర్ఘ కాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో, రాజకీయ రంగంలో, సామాజిక వేత్త గా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. చిన్న వయస్సు నుంచి విద్య పై శ్రద్ధ వహించి ఆ కాలంలో బీఎస్సీ పట్టా సాధించారని, 30 సంవత్సరాల పాటు వివిధ శాఖల మంత్రిగా కృషి చేసి దేశానికి సేవ చేశారని కొనియాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నిరుపేదల ఆకలి తీర్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని ప్రోత్సహించా రని , అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని తెలిపారు. రాజ్యాంగ సవరణ లో అణగారిన వర్గాలకు న్యాయం చేస్తూ అనేక మార్పులను జగ్జీవన్ రావ్ తీసుకొని వచ్చారని ఆయన తెలిపారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో మనమంతా సమాజానికి సేవ చేస్తూ మంచి పేరు తీసుకుని రావాలని, కాలం, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రావని, వీటిని సద్వినియోగం చేసుకుంటే దారిద్రంలో ఉన్నవారు సైతం ధనవంతులుగా ఆవిర్భవించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు .అంతకు ముందు వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప,రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, టి.ఎన్.జి. ఓ. అధ్యక్షులు బోంకూరి శంకర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సంఘ, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు,ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.