Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 7 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)

సంఘ్ పరివార్‌ పత్రిక ‘ఆర్గనైజర్‌’లో ప్రత్యేక కథనం పినరయి విజయన్‌, రాహుల్‌ గాంధీ విమర్శల నేపథ్యంలో తొలగింపు


న్యూఢిల్లీ : మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని వివిధ రూపాల్లో దాడులు సాగిస్తున్న సంఫ్ు పరివార్‌..తమ లక్ష్యాలను కూడా ఇదివరకే అక్షరబద్ధం చేసింది. వక్ఫ్‌ బోర్డుల తర్వాత క్రైస్తవ చర్చిల పని పట్టాల్సిన అవసరముందని పేర్కొంటూ ఆర్ఎస్ఎస్‌ అధికార పత్రిక ‘ఆర్గనైజర్‌’ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వక్ఫ్‌ సవరణల బిల్లును ఆమోదించిన నేపథ్యంలో సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఈ బిల్లుకు క్రైస్తవుల నుంచి మద్దతు ఉందంటూ బిజెపి, సంఘ్ పరివార్‌ నేతలు దుష్ప్రాచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‘ఆర్గనైజర్‌’ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ముస్లిం తర్వాత మోడీ సర్కార్‌ లక్ష్యం క్రైస్తవేలనంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు విజయన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆర్గనైజర్‌’ కథనం ఆర్ఎస్ఎస్‌ దుర్బుద్ధిని ప్రతిబింబిస్తోందని, అనవసరంగా, అసందర్భంగా ఆ పత్రిక క్రైస్తవ ఆస్తుల గురించి కథనంలో ప్రచురించిందని తప్పుబట్టారు. ఇది తప్పుడు సంకేతాలను ఇవ్వడమే గాక, ఆర్ఎస్ఎస్‌ దుర్బుద్ధిని కూడా ప్రతిబింబిస్తోందని విజయన్‌ పేర్కొన్నారు. ‘ఆర్గనైజర్‌ కథనం ద్వారా ఆర్ఎస్ఎస్‌ తదుపరి లక్ష్యం క్యాథలిక్‌ చర్చిలేనన్న సంగతి అర్థమవుతుంది. ముస్లిం మైనార్టీలకు ఉన్న రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ వక్ఫ్‌ సవరణల బిల్లును పార్లమెంటులో ఆమోదించుకున్న నేపథ్యంలో ఆర్గనైజర్‌ కథనం రావడం చూస్తే సంఘ్ పరివార్‌ తదుపరి లక్ష్యం క్రైస్తవులేనన్నది స్పష్టమవుతోంది’ అని విజయన్‌ తెలిపారు. మైనార్టీలను క్రమ, క్రమంగా ఒకరి తర్వాత ఒకరని నాశనం చేయాలనే బృహత్తర కుట్రలో భాగంగానే వక్ఫ్‌ సవరణల బిల్లును తీసుకొచ్చారని విజయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వినాశకర చర్యలకు వ్యతిరేకంగా ప్రగతిశీల, ప్రజాతంత్ర, లౌకిక ఉద్యమాలను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ ఇదే రీతిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేథలిక్‌ చర్చిలు, వక్ఫ్‌ బోర్డుల అధీనంలో వున్న స్థలాలను పోలుస్తూ వచ్చిన సదరు వ్యాసాన్నిఆర్గనైజర్‌ తొలగించింది. ఇంతకీ ఆ కథనంలో ఏముంది భారత్‌లో ఎవరికి ఎక్కువ భూమి వుంది? కేథలిక్‌ చర్చిలు వర్సెస్‌ వక్ఫ్‌ బోర్డుపై చర్చ అనే శీర్షికతో ఆర్గనైజర్‌లో వ్యాసం వచ్చింది. భారతదేశంలో కేథలిక్‌ చర్చిల అధీనంలో ఎండు కోట్ల హెక్టార్లకు పైగా భూమి వుందని, అది, ప్రభుత్వేతర భూ యజమానుల్లో ఇదే అతి పెద్దదని ఆ వ్యాసం పేర్కొంది. ఈ భూమి విలుల రూ.ఇరవై వేల కోట్లు వుంటుందని అంచనా వేసినట్లు తెలిపింది. భారతదేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వక్ఫ్‌ బోర్డు కన్నా ఎక్కువగా చర్చి కీలక పాత్ర పోషిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో అతిపెద్ద భూ యజమాని అంటే వక్ఫ్‌ బోర్డేనని అందరిలోనూ సాధారణంగా ఒక నమ్మకం వుందని, కానీ వాస్తవిక డేటాతో ఈ నమ్మకం సరిపోలడం లేదని పేర్కొంది. కేథలిక్‌ చర్చి అతిపెద్ద ప్రభుత్వయేతర భూ యజమానిగా ఆవిర్భవించిందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూముల సమాచార వెబ్‌సైట్‌ నుండి సేకరించిన డేటాను ఈ వ్యాసంలో పొందుపరిచారు. ఈ వ్యాసం లక్ష్యమేంటి ఈ వ్యాసం లక్ష్యం ఏమిటని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే బిజెపి వైఖరికి ఇదొక చక్కని ఉదాహరణ అని విమర్శించారు. దీనిపై తాను ఇప్పటికే ప్రజలను హెచ్చరించానన్నారు. క్రిస్టియన్లపై తన దృష్టిని మళ్లించేందుకు బిజెపికి ఇక ఎక్కువ సమయం పట్టదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు రాహుల్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కాంగ్రెస్‌ నేతలు రమేష్‌ చెన్నితాల కూడా ఆర్ఎస్ఎస్‌ మేగజైన్‌ ప్రచురించిన వ్యాసాన్ని తీవ్రంగా విమర్శించారు. కాగా ఈ వివాదంపై స్పందిస్తూ మేగజైన్‌ సంపాదకులు ప్రఫుల్‌ కేట్కర్‌, ఆ వ్యాసం చాలా పాతదని చెప్పారు. వక్ఫ్‌ బిల్లు తర్వాత దాన్ని బయటకు లాగారని తెలిపారు.