

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై ఏప్రిల్ 5న దాడికి చేసి, హత్యాయత్నంకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన నిందితుడు బురిలి ఆదినాయణ (21 సం.లు)ను కొద్ది గంటల వ్యవధిలోనే అరెస్టు చేసామని
ఏప్రిల్ 6న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – గరివిడి మండలం శివరాం గ్రామంలో 18 సం.ల యువతి కోండ్రు అఖిల (18 సం.లు) తన ఇంటిలో ఏప్రిల్ 5న ఇంటి పనులు చేసుకొంటుండగా, ఆమెపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి, హత్యాయత్నంకు పాల్పడ్డారన్నారు. గాయపడిన యువతి కేకలు విని, చుట్టు ప్రక్కలవాళ్ళు పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడి తప్పించుకొని పారిపోయాడన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే గరివిడి ఎస్ఐ, చీపురుపల్లి ఇన్చార్జ్ సిఐ, చీపురుపల్లి డిఎస్పీ మరియు తాను సంఘటనా స్థలంకు చేరుకొని, విచారణ చేపట్టామన్నారు. గాయపడిన అఖిలను చికిత్స నిమిత్తం చీపురుపల్లి ఆసుపత్రికి, అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ కేసును
చేధించేందుకు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుడు పరారీ కాకుండా వాహన తనిఖీలు చేపట్టడం, ఇతర పోలీసు స్టేషన్లును అప్రమత్తం చేసామన్నారు. అదే విధంగా నేర స్థలంను క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సందర్శించి, నేర స్థలం క్షుణ్ణంగా పరిశీలించి, కొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించామన్నారు. బాధితురాలు చెప్పిన ఆధారాలతో బురిలి ఆదినారాయణ (21 సం.లు)ను కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకొని, విచారణ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విచారణలో.. అదే గ్రామానికి చెందిన బురిలి ఆదినారాయణ (21సం.లు) బాధితురాలు కోండ్రు అఖిల (18సం.లు) సోదరులకు స్నేహితుడని, తరుచూ వారింటికి వస్తుండేవారని, అఖిలను చెల్లిగా పిలిచేవాడన్నారు. ఇటీవల కాలంలో అఖిల తరుచూ ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండడంతో ఆమెపై అనుమానం పెంచుకొన్నారన్నారు. అదే విధంగా నిందితుడు బురిలి ఆదినారాయణ విజయవాడలో ఉంటున్న ఒకామెకు అసభ్యకరమైన సందేశాలను ఇన్స్టాగ్రాంలో పంపినట్లుగా బాధితురాలికి తెలిసిందని, ఆమె గ్రామంలో ఆదినారాయణ ప్రవర్తన గురించి చెడుగా ప్రచారం
చేస్తున్నట్లుగా భావించి, ఆమెతో ఘర్షణ పడ్డారని, తనపై చెడు ప్రచారాన్ని ఆపకపోతే అఖిలను చంపేస్తానని గతంలోనే బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అఖిలను హత్య చేయాలనే దురుద్ధేశంతో ఏప్రిల్ 5న వాకింటికీ వెళ్ళి, ఇంటిలో దాక్కుని, ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఆమెను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు, ఆమె కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుండి పరారయ్యాడన్నారు. నిందితుడు పరారయ్యే క్రమంలో సంఘటన స్థలం వద్ద నిందితుడికి చెందిన బ్లూటూత్ ఇయర్ బడ్ పడిపోగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. విచారణలో నిందితుడు బురిలి ఆదినారాయణ నేరంను అంగీకరించగా, హత్యాయత్నంకు వినియోగించిన కత్తి, మంకీ క్యాప్, నోయిన్ బ్రాండ్ ఇయర్ బడ్, మొబైల్ ఫోను, బట్టలను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఈ తరహా కేసులను తీవ్రంగా పరిగణించి, న్యాయస్థానాల్లో త్వరితగతిన శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కేసులను రాష్ట్ర హెూంమంత్రి, రాష్ట్ర డిజిపి, అడిషనల్ డిజి, డిఐజి నిరంతరం పర్యవేక్షించారన్నారు. ఈ కేసులో నిందితుడిని నేరంకు పాల్పడిన రెండు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా దర్యాప్తు పూర్తి చేసి, కేసు త్వరలో ట్రయల్ పూర్తయ్యే విధంగాను, నిందితడు కఠినంగా శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, చీపురుపల్లి ఇన్చార్జ్ సిఐ హెచ్.ఉపేంద్రరావు, గరివిడి ఎస్ఐ బి.లోకేశ్వరరావు, కానిస్టేబుళ్ళు యు.ఆనందరావు. టీ.హరి లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, చీపురుపల్లి ఇన్చార్జ్ సిఐ హెచ్.ఉపేంద్రరావు, గరివిడి ఎస్ఐ బి.లోకేశ్వరరావు, ఎస్బీ ఎస్ఐ కే.కే.కే.నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.