

జనం న్యూస్ , ఏప్రిల్ 08, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.కమాన్ పూర్ మండలానికి చెందిన కల్వల జయ్య తనకు కాగజ్ నగర్ లో ఉన్న రేషన్ కార్డు ను కమాన్ పూర్ మార్చాలని కొరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సి హెచ్. శ్రీమన్ నారాయణ ఎల్ఆర్ఎస్ లో మా తండ్రి పేరు మీద ఉన్న స్థలం క్రమ బద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా నిషేధిత స్థలం అని వస్తుందని, మా స్థలం ఉన్న ప్రాంతంలో చుట్టూ ఇండ్లు భవనాలు ఉన్నాయని, తమకు క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.గోదావరిఖని పట్టణానికి చెందిన జి.ఆర్. ప్రసాద్ 49వ డివిజన్ లో రోడ్డును ఆక్రమిస్తూ ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతుందని, దీనిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, రామగుండం మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ వెంటనే విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.