

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నిబంధనల ప్రకారం పరిష్కరించాలి
ఇండస్ట్రీయల్ పార్క్ లో ఎస్సీ ఔత్సాహికవేతలకు భూ కేటాయింపు అవగాహన
ఎస్సి కార్పొరేషన్ క్రింద నూతన లబ్దిదారులకు పథకాలను అందించాలి
ఎస్సీ ఎస్టీ కేసులలో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
ఎన్టిపిసి మిల్లినియం హల్ లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా అధికారులతో సమీక్షించిన జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వి.రాం చందర్
జనం న్యూస్, ఏప్రిల్ 09, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.రాం చందర్ అన్నారు.మంగళవారం జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వి.రాంచందర్ ఎన్టిపిసి మిల్లినియం హల్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ , పెద్దపల్లి డిసిపి, మంచిర్యాల డిసిపి అగడి భాస్కర్, జాతీయ ఎస్సీ కమీషన్ సంచాలకులు సునీల్ బాబు, రిసేర్చ్ అధికారి డి. వరప్రసాద్ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు.పెద్దపల్లి జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో జారీ చేసిన సూచనలు, పనుల పురోగతి వివరాలను, తమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, ఈడి ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సంక్షేమ శాఖ, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, పరిశ్రమల శాఖ, లీడ్ బ్యాంకు మేనేజర్ వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి.రాం చందర్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పకడ్బందీగా నమోదు చేయాలని, నిందితులకు చట్టం ప్రకారం శిక్ష పడేందుకు వీలుగా అవసరమైన సాక్ష్యాలను పక్కాగా నమోదు చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సకాలంలో పరిష్కరించాలని, అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుందని అన్నారు.నిన్న వర్గాల యువత పరిశ్రమల స్థాపించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలు సబ్సిడీ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. రామగుండం, బెల్లంపల్లి లో ఉన్న ఇండస్ట్రీయల్ పార్క్ లో ఎస్సి ఔత్సాహిక వేత్తలకు భూ కేటాయింపులో ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.ఔత్సాహికవేత్తలకు గ్యారెంటీ లేకుండా రుణాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను బ్యాంకులు తూచ తప్పకుండా పాటించేలా చూడాలని అన్నారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన, స్టాండప్ ఇండియా, ముద్రా రుణాలు వ్యాపారవేత్తలకు అందించాలని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు సబ్సిడీ సొమ్ము విడుదలయ్యే విధంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అన్నారు.ఎస్సీ కార్పోరేషన్ క్రింద వివిధ సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులు మళ్లీ ఎంపిక కాకుండా నూతన లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందించే వివిధ సబ్సిడీల పై ఎస్సీలకు విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రభుత్వ పథకాలు అవసరమైన వారు వినియోగించుకునేలా చూడాలని అన్నారు.అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, కులాంతర వివాహాల సబ్సిడీ సకాలంలో అందే విధంగా చూడాలని అన్నారు. బ్యాంకుల ద్వారా ఎస్సి లబ్దిదారులకు విద్యా రుణాల మంజూరు ఎలా జరుగుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యా రుణాల పంపిణీ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. భూ వివాదాల సమయంలో సర్వే నిర్వహించాలని అన్నారు. దళితుల భూమిని ఆక్రమించాలని చూసే వారి పై చట్ట ప్రకారం కేసుల నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో పోలీసులు అరెస్ట్ చేయడం లేదనే మాట బయట బలంగా వినపడుతుందని, తప్పుడు కేసు కాని పక్షంలో తప్పనిసరిగా విచారించి నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఎస్సీ ఎస్టీ కేసులలో తీర్పులు వచ్చే విధంగా చూడాలని అన్నారు. చట్టరీత్యా పోలీస్ అధికారులు నడుచుకోవాలని , పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుకు తప్పనిసరిగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు కావాలని అన్నారు. ప్రభుత్వ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని శాఖల వారిగా బ్యాక్ లాగ్ పోస్టులు, కారుణ్య నియామకాలు, పదోన్నతుల పెండింగ్ వివరాలను అందించాలని అన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎన్టిపిసి, సింగరేణి, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కింద జరిగే భూసేకరణలో దళితులకు కూడా న్యాయమైన పరిహారం తప్పనిసరిగా అందజేయాలని, పరిహారం అందించిన తర్వాత మాత్రమే భూ బదలాయింపులు జరగాలని అన్నారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రింద నమోదైన కేసులలో బాధితులకు చట్ట ప్రకారం పరిహారం అందించామని అన్నారు. బాధితులకు ఉపాధి కల్పన కింద రేషన్ షాప్ డీలర్ షిప్, వారి పిల్లలకు గురుకులాలు, కేజీబీవీ చేర్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు.అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద 2024-25 సంవత్సరంలో 5 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3 అర్హులను ఎంపిక చేసి 47 లక్షల చెల్లింపులు పూర్తి చేశామని అన్నారు. డీగ్రి , ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపు ఏర్పాటు చేసి ఈ పథకం పై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కులాంతర వివాహాల క్రింద ఈ సంవత్సరం 16 జంటలకు 40 లక్షలు పంపిణీ చేశామని అన్నారు.అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, పెద్దపల్లి, గోదావరిఖని ఏ.సి.పిలు, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.