Listen to this article

జనంన్యూస్. 08. సిరికొండ. ప్రతినిధి.

మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జాతీయ కమిటీ పిలుపుమేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ రూరల్ కార్యదర్శి వి. ప్రభాకర్ మాట్లాడుతూ మన దేశ కార్మిక వర్గం భద్రతకోసం, మంచి వేతనం కోసం, ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే, మరోవైపు రైతులు ఎంఎస్పీ కోసం, గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ, రుణ రద్దు డిమాండ్లతో పోరాడుతున్నారన్నారు. సమగ్ర వ్యవసాయ, కార్మిక చట్టాల కోసం వ్యవసాయ కార్మికులు, భూమి లేని, పేద రైతులు భూమి కోసం, అదివాసీలు, అటవీ హక్కుల చట్టం 2006 అమలు కోసం జల్ జంగల్-అమీన్’ రక్షణ కోసం పోరాడుతన్నారన్నారు. సామాజిక వివక్షత, అణచివేతకు లోనైన వర్గాలు సమాజంలో సరియైన, గౌరవప్రదమైన స్థానం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్నారన్నారు. యువత సురక్షితమైన ఉపాధి కోసం, విద్యార్థులు, సార్వత్రిక, ఉచిత, లౌకిక, శాస్త్రీయ విద్య కోసం మహిళలు, భద్రత, సమానత్వం, సరియైన ప్రతిష్ట కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత, జీవనోపాధి కోసం, రాష్ట్రాలు సమాఖ్యవాదం కోసం, చిన్న, మధ్యతరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నారన్నారు. ఈ పరిస్థితులో ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ, భజరంగ్ దళ్ తదితర ఆర్ఎస్ఎస్ పరివారం 1779లో చనిపోయిన ఔరంగజేబ్ సమాధి గొడవను రేకెత్తించి అమాయక హిందూ ప్రజలను రెచ్చగొట్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ప్రజల సమస్యలైన రైతుల ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార పదార్థాల ధరల పెరుగుదల మరియు అనేక ఇతర సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి మత విద్వేష మరియు మత విభజన వ్యవహారంను ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్రంగా సాగిస్తూ ఆర్ఎస్ఎస్- బీజేపీలు సమాజాన్ని అత్యంత విషపూరితం చేస్తూ ఓట్లు దండుకొని లౌకిక భారత్ ను ధ్వంసం చేస్తున్నాయన్నారు.
మోడీ ప్రభుత్వం ప్రజలను మతవిద్దేశాలలో ముంచి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని ఆరోపించారు. కార్మిక వర్గంపై, రైతాంగంపై మాత్రమే కాకుండా విద్యారంగంపై కూడా మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యులను నిలువు దోపిడీ చేస్తున్నదన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు సంయుక్తంగా అమలు చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు,
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు, కొత్త వ్యవసాయ మార్కెటింగ్ బిల్లు, కొత్త విద్యా విధానాలకు వ్యతిరేకంగా, సమాఖ్యవాదం, లౌకికవాదం ప్రజాస్వామ్య రక్షణకోసం పోరాడదామని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చిందన్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, పి. రామకృష్ణ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవరాం, జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, కమిటీ, బోధన్ డివిజన్ కార్యదర్శి డి.రాజేశ్వర్, నిజామాబాద్ నగర కార్యదర్శి ఎం. సుధాకర్, జిల్లా నాయకులు కే.గంగాధర్, సీహెచ్ సాయన్న, బి.మల్లేష్, సత్తెక్క, డి.కిషన్, బి.మురళి, జీ.కిషన్, ఆర్.రమేష్ మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.