

జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగాను త్వరలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి తీసుకురానున్నట్లు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి తెలిపారు.గురువారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ హిల్ కాలనిలో ఉన్న కమలానెహ్రూ ఆసుపత్రికి అనుసంధానంగా పైలాన్ కాలని బస్తీ దవఖాన పనిచేస్తుందని, ఈ దవఖాన పైలాన్ కాలనీ ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. పైలాన్ కాలనీ మాదిరిగానే హాలియాలో సైతం బస్తీ దాఖానను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడటం జరిగిందని, త్వరలోనే అక్కడ బస్తి దవాఖాన ఏర్పాటు చేస్తామని, అంతేకాక నియోజకవర్గం లోని నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రి, ఇతర ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచి నాగార్జునసాగర్ ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియోజకవర్గానికి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లాడుతూ ఆయా సబ్ సెంటర్ల పరిధిలో ఉన్న గృహస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎంలు ,ఆశ కార్యకర్తలు ఇళ్లిళ్ళు తిరిగి వ్యాక్సినేషన్, ఇతర వైద్య సదుపాయాలను కల్పించే వారని, వారికి ఉన్న పనిభారాన్ని తగ్గించేందుకుగాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో బస్తీ దవాఖాన సౌకర్యం మంజూరు చేసిందని, ఈ బస్తీ దవాఖాన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒక డాక్టర్, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్ లతో పనిచేస్తుందని, ఈ బస్తీ దవఖానలో టెస్టింగ్ ల్యాబ్ తో పాటు, సిబిపి ప్యాతలాజికల్, బయోలాజికల్ పరీక్షల ల్యాబ్ ఉంటాయని ,ఇక్కడ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగుల మొబైల్ కు నేరుగా మెసేజ్ ద్వారా పంపించే ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఈ బస్తీ దవాఖాన నాగార్జునసాగర్ ఆసుపత్రికి అనుసంధానంగా ఉంటుందన్నారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ , హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ , కర్నాటి లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.