


ఏప్రిల్ 30 లోపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి
లాభదాయకమైన యూనిట్లు ఏర్పాటుకు చర్యలు
రాజీవ్ యువ వికాసం పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్, ఏప్రిల్ 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
యువ వికాసం అమలు కు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రాజీవ్ యువ వికాసం పై అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులని, తెల్ల రేషన్ కార్డు లేని పక్షంలో ఆదాయ ధ్రువీకరణ పత్రం లో వార్షిక ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 రూపాయల లోపు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయల లోపు ఉండాలని కలెక్టర్ తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లెదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, రవాణా రంగ పథకాలకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకాలకు పట్టాదారు పాస్ పుస్తకం, దివ్యాంగులు సైతం సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో ఆన్ లైన్ పోర్టల్ లో లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలని అన్నారు.ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ఆఫ్ లైన్, ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ చేయాలని, ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తులను సైతం ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారి, బ్యాంకర్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి ఒకరు కలుపుకొని బృందంగా ఏర్పాటు కావాలని అన్నారు. మండల బృందం దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హులను గుర్తించి జిల్లా బృందానికి పంపాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 32 వేల దరఖాస్తులు వచ్చాయని, ఏప్రిల్ 14 వరకు మరో 3 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 30 లోపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి మంజూరు చేసే యూనిట్ లక్ష్యాల వివరాలను ఏప్రిల్ 15 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారికి తెలిపారు. ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి అర్హుల ఎంపికకు ఎంపీడీఓ లు ,మున్సిపల్ కమిషనర్లు బ్యాంకర్లతో చర్చించి తుది ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకు పాటించే విధి విధానాలు, షెడ్యూల్ పై మీడియా ద్వారా దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలని అన్నారు.దరఖాస్తుల స్క్రుటిని తరువాత పథకానికి ఒక దరఖాస్తు ఎందుకు ఎంపిక చేస్తున్నాం, మరొకరి దరఖాస్తు ఎందుకు తిరస్కరిస్తున్నామో కారణాలు తెలియజేస్తూ జిల్లా కమిటీకి పంపాలని కలెక్టర్ తెలిపారు. ఒక గ్రామంలో ఒకే రకమైన యూనిట్లు స్థాపించకుండా జాగ్రత్తలు పాటించాలని, లాభదాయక యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ ,లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె.రంగా రెడ్డి, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి వినోద్ కుమార్, ఈడి ఎస్సీ కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లు ఎంపిడిఓలు, సంబంధిత ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.