Listen to this article

గుంతల మయంగా బ్యాంకులకు వెళ్లే రహదారి – ఇబ్బంది పడుతున్న వృద్ధులు, పెన్షనర్లు

జనం న్యూస్ – ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –

నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ అక్బర్ కూరగాయల దుకాణం నుండి సత్యనారాయణ స్వామి గుడికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది . ఈ దారిలోనే మూడు బ్యాంకులు, సంఘమిత్ర స్టోర్స్ ఉన్నాయి. నల్లగొండ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం కూడా ఉండటం గమనార్హం, బ్యాంకులకి పెన్షన్ల కోసం వచ్చే వయోవృద్ధులు, బియ్యం కోసం, గ్యాస్ కోసం సంఘమిత్ర స్టోర్స్ కు వచ్చే వృద్ధులు ఈ దారిలో రావటానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, స్థానిక సత్యనారాయణ స్వామి గుడి, ఏలేశ్వర మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళటానికి కూడా ఇదే ప్రధాన రహదారి కావడంతో గుడికి వెళ్లే భక్తులు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు, అయినా కూడా ప్రజాప్రతినిధులు ఎవరు ఈ రోడ్డు గురించి పట్టించుకోకపోవడంతో ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతోందో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రహదారిలో ఒకటే ఇల్లు ఉండటం స్థానిక ప్రజా ప్రతినిధులకు ఓట్లు లేకపోవడంతో ఈ రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. కెనరా బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్, నాగార్జున గ్రామీణ బ్యాంక్ లు, ఇదే వీధిలో ఉండటం వలన ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. గుంతల మయంగా, రాళ్లు తేలి ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకులకు వచ్చే వృద్ధుల బాధ వర్ణనాతీతం, వర్షాకాలంలో ఈ రహదారి గుంతలు నిండా నీరు చేరి నడవలేని పరిస్థితి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ విషయమై నందికొండ మున్సిపాలిటీ ఐదో వార్డ్ మాజీ కౌన్సిలర్ హీరేకార్ రమేష్ జి ని సంప్రదించగా ఐదో వార్డులోని బ్యాంకు రోడ్డుకు సంబంధించి ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి ఎమ్మెల్సీ నిధుల నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేశారని, అట్టి కాపీని తానే స్వయంగా పంచాయతీరాజ్ ఏఈ రామకృష్ణకు మరియు నందికొండ మున్సిపల్ కమిషనర్ కు అందజేశానని,, అధికారుల అలసత్వంతో నిధులు వెనక్కి వెళ్ళిపోయాయని పేర్కొన్నారు. నందికొండ మున్సిపల్ చైర్మన్ , మున్సిపల్ కమిషనర్లు సిపిఓ కలెక్టర్ కు సంబంధిత నిధుల విషయమై లెటర్ ఇవ్వాలని కానీ వారు ఆ పని చేయకపోవడం వల్ల ఐదవ వార్డ్ బ్యాంకు రోడ్డు కొరకు ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి ఇచ్చిన 10 లక్షల రూపాయలు మరియు ఏడవ వార్డు లో రోడ్డు కొరకు రాజ్యసభ సభ్యులు కేశవరావు ఇచ్చిన 1,80,000 రూపాయల నిధులు వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు, కావున ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి ప్రజలందరికీ ఉపయోగపడే ఐదవ వార్డు బ్యాంకు రోడ్డును నిర్మించాలని టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కోరుతున్నామని తెలిపారు.