

జనం న్యూస్ 13 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో మైనారిటీలకు, దళితులకు, క్రైస్తవులకు రక్షణ లేకుండా చేస్తూ ఆర్.ఎస్.ఎస్ మతోన్మాద ఎజెండాను బిజెపి అమలులో భాగంగా ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని చిమ్ముతూ అనేక దాడులు చేస్తుందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ దేశ వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం ఉదయం విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ లో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వక్ఫ్ బోర్డు సవరణ చట్టం జీ.ఓ ప్రతులను అగ్నిలో దగ్ధం చేసి నిరసన తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టనున్నారని ఆరోపించారు. ఈ చట్టం ముస్లిం ఆస్తుల కబ్జా చేసి కార్పొరేట్లకి దారాదత్తం చేయడంలో కుట్రలో భాగమే తప్పా వక్ఫ్ ఆస్తులు అభివృద్ధి కోసం కాదని మండిపడ్డారు. ప్రతిపక్షాలు సూచించిన సవరణలను పరిగణనలోకి తీసుకోకుండా వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణను అర్ధరాత్రి సమయంలో మోదీ ప్రభుత్వం ఆమోదింపజేయించడంలో పార్లమెంటు ఉభయసభలను బుల్డోజ్ చేసిందని విమర్శించారు. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ దేశాన్ని మతం పేరిట విభజించేందుకు స్పష్టమైన ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. బ్రిటిషోడిల విభజించి పాలించు విధానాన్ని భారత దేశంలో అనుసరిస్తూ మైనారిటీ వ్యతిరేక రాజకీయాలను బిజెపి అవలంభిస్తుందని ఆక్షేపించారు. బడా గుత్తేదారుల కోసం భూసేకరణ లక్ష్యంగా సాగే ప్రయత్నమే ఇదని దుయ్యబట్టారు. వక్స్ బిల్లుపై చర్చ సమయంలో వక్ఫ్ బోర్డు డబ్బును మైనారిటీల సాధికారత కోసం వినియోగిస్తామని బీజేపీ నేతలు బూకటపు హామీలు ఇచ్చారని చెబుతూ మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ పథకాల కింద మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లను ఆపేయడాన్ని సీపీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తరువాత చర్చి, క్రైస్తవ మైనారిటీల వ్యవస్థలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పద్ధతి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. వర్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేవలం నల్ల స్ట్రిప్పులతో నిరసన తెలిపినందుకు మూడు వందల మంది ముస్లింలకు యూపీ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం మైనారిటీలను భయపెట్టడానికి కాకపోతే మరెందుకని ఆక్షేపించారు. దేశ ఐక్యతకు, రాజ్యాంగంలో మత స్వేచ్ఛకు హామీనిచ్చే నిబంధనలకు విఘాతం కలిగిస్తూ మైనారిటీలను లక్ష్యంగా అమలవుతున్న విధానాలను ఎండగట్టాలని సీపీఐ ఉద్యమాలకి పిలుపునిచ్చిందన్నారు. ఈ పోరాటంలో ముస్లిం మైనారిటీ సోదరులు సిపిఐ నిర్వహిస్తున్న పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని బుగత అశోక్ కోరారు.
విజయనగరం జిల్లా ముస్లిం సమాఖ్య నాయకులు షేక్ అస్లం మాట్లాడుతూ మా ముస్లిం భూములు కొల్లగొట్టే నల్ల చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నమని అన్నారు. వక్స్ చట్టానికి వ్యతికిస్తూ సిపిఐ చేస్తున్న పోరాటాలకి మా ముస్లిం సమాఖ్య నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నమని అదేవిధంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కి వ్యతిరేకంగా సిపిఐ చేస్తున్న పోరాటాల్లో మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలిపారు. ఈ నెల 16 వ తేదీన జరగబోయే ర్యాలీ మరియు ఆందోళనను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, విజయనగరం జిల్లా ముస్లిం సమాఖ్య నాయకులు మహమ్మద్ షరీఫ్, షేక్ ముస్తఫా, అబ్దుల్ రెహమాన్, సయ్యద్ ఇంతియాజ్, షేక్ దావుద్ మరియు కార్మికులు పాల్గొన్నారు.