

జనం న్యూస్- జనవరి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను గురువారం నాడు పలు దేశాలకు చెందిన కైట్ ప్లయర్స్ సందర్శించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అంతర్జాతీయ పతంగుల పండుగను (కైట్ ఫెస్టివల్) హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ కు భారత దేశంలోని 14 రాష్ట్రాల నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా జపాన్ ,థాయిలాండ్ ,మలేషియా, ఇండోనేషియా ,కంబోడియా ,వియత్నం ,శ్రీలంక ,పోలాండ్ ,కెనడా ,సింగపూర్ ,ఫ్రాన్స్ ,ఉక్రెయిన్ సుమారు 20 దేశాల నుండి కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న వారు గురువారం తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ను సందర్శించారు. ముందుగా బుద్ధ వనం చేరుకున్న ఈ బృందం బుద్దవనంలోని మహా స్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరం, బుద్ధ చరిత వనం, ధ్యానవనం ,స్తూప వనాలను సందర్శించారు. వీరికి బుద్ధ వనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన్ ,ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర లు ఘనంగా స్వాగతం పలికారు . ఈ బృందానికి మహా స్తూపం సమావేశ మందిరంలో బుద్ధ వనం గురించి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం వీరు టూరిజం లాంచీలో నాగార్జున కొండను సందర్శించారు. వీరితోపాటు టూరిజం అధికారులు లోకేష్, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.