

జనం న్యూస్ ఏప్రిల్ 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)–సబ్జెక్టు-
వేసవి కాలం వచ్చిందంటే తల్లుల బాధ్యత రెట్టింపవుతుంది. వేడి కారణంగా పిల్లలకు ఏ సమస్య వస్తుందో, వాళ్లని ఎలా కాపాడుకోవాలో అనే టెన్షన్ పెరుగుతుంది. నిజానికి అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. వేసవి వస్తోందనగానే పిల్లల సంరక్షణ విషయంలో ఏమేం చేయాలనేది ప్లాన్ చేసేసుకోవాలి. అప్పుడు ఏ సమస్యా ఉండదు. ఒకవేళ మీరు అలా ప్లాన్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడైనా ఈ జాగ్రత్తలు తీసుకోండి. వేసవిలో పిల్లలకు వచ్చే మొట్టమొదటి సమస్య డీ హైడ్రేషన్. అందుకే ప్రతి పావుగంటకో సారి కాసిన్ని నీళ్లు పట్టించండి. వాళ్లు తాగనని మొరాయించినా సరే.. ఎలాగో బుజ్జగించి పట్టించండి తప్ప వదిలిపెట్టకండి. అలాగే చక్కని పోషకాహారం అందించడం కూడా అవసరం. రోజుకు కనీసం రెండు మూడు గ్లాసుల పాలు పట్టించండి. వీలైనంత ఎక్కువగా పండ్డు వాళ్ల కడుపులోకి వెళ్లేలా చూడండి. పిల్లలు ఫ్రూట్స్ తినడానికి ఓ పట్టాన ఇష్టపడరు. కాబట్టి ఏ జ్యూస్ రూపంలోనో, స్వీట్ రూపంలోనో ఇవ్వడానికి ట్రై చేయండి. గోధుమలు, రాగులు, బాదం, జీడిపప్పు, సోయా గింజల్ని వేయించి పిండి పట్టించండి. దీనితో జావ కాసి పట్టిస్తే బలం వస్తుంది. కూరగాయల్ని కూడా అన్నంతో కలిపి ఉడికించి పెట్టేయండి. వేడికి తట్టుకోలేక పిల్లలు ఐస్ లు, ఐస్ క్రీముల కోసం గొడవ చేస్తుంటారు. చల్లటి నీళ్లు తాగేస్తుంటారు. అది చాలా ప్రమాదం. వాళ్లకు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. టాన్సిల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఓవర్ హీట్ చేసి జలుబు, జ్వరం వంటివి కూడా రావొచ్చు. అందుకే పిల్లలు అతి చల్లటివి ఎక్కువ ఇవ్వకండి. ఇక వేసవిలో పిల్లలకు స్కిన్ ప్రాబ్లెమ్స్ కూడా వస్తాయి. అందుకే వాళ్లకి వేసే దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నైలాన్, సిల్క్ వంటివి వేయకుండా వదులైన కాటన్ దుస్తులే వేయాలి. చెమటతో దుస్తులు తడిచిపోతే వెంటనే మార్చేయాలి. ముఖ్యంగా లో దుస్తులు, డైపర్లు వీలైనన్ని ఎక్కువసార్లు మార్చాలి. అప్పుడప్పుడూ చల్లని నీటితో ముఖం కడుగుతూ ఉండాలి. అయితే స్నానం మాత్రం మరీ చల్లని నీటితో చేయించకండి. లేదంటే ఒళ్లు పేలటం వంటి సమస్యలు రావొచ్చు. అలాగే విటమిన్ లోపాల కారణంగా అలర్జీలు వస్తాయి. అందుకే విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాదు… ఆటల పేరుతో పిల్లలు బాగా అలసిపోతూ ఉంటారు. నీరసించి పోతారు. అందుకే బయటకు ఎక్కువ వెళ్లనివ్వకండి. నీడపట్టునే ఉండేలా చూసుకోండి. ఇండోర్ గేమ్స్ ఆడించండి. పెయింటింగ్, టాయ్ మేకింగ్ లాంటివేమైనా చేయించండి.