

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
దళిత సంక్షేమం, అభ్యున్నతికి ఏ పార్టీ అమలుచేయని పథకాలు టీడీపీ అమలుచేసింది : ప్రత్తిపాటి.
అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా, సమాజంలోని అన్నివర్గాల ప్రజల ఐక్యతకోసం, సమసమాజ నిర్మాణంకోసం పాటుపడిన గొప్ప పోరాటయోధుడు అంబేద్కర్ అని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కోమటినేనివారిపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీమంత్రి, గ్రామస్తుల్ని, కూటమిపార్టీల శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనల్ని తెలుగుదేశం పార్టీ ఆచరణసాధ్యం చేసిందని, దళితుల సంక్షేమం, అభ్యున్నతికి దేశంలో ఏ రాజకీయపార్టీ అమలుచేయని పథకాలు అమలుచేసిందని ప్రత్తిపాటి తెలిపారు. ఉచిత విద్యుత్, అంబేద్కర్ విదేశీవిద్య, చేతివృత్తుల వారికి ఉపాధి కల్పన, చర్మకారులకు పింఛన్ల పంపిణీ వంటి అనేక పథకాలు అమలు చేసిందన్నారు. భూమి కొనుగోలు పథకంతో భూమిలేని నిరుపేద దళితుల్ని భూ యజమానుల్ని చేసిన ఘనత టీడీపీదేనని ప్రత్తిపాటి తెలిపారు.8 లక్షల ఎకరాల భూమి కొని టీడీపీ ప్రభుత్వం పేదదళితులకు పంచిందన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల అమలుతో దళితవర్గాలకు ప్రత్యేక గుర్తింపును తెలుగుదేశం కల్పించిందన్నారు. టీడీపీ దళితవర్గాలకు అమలుచేసిన పథకాల్ని గతప్రభుత్వం పూర్తిగా నిలిపేసి, వారిని తమస్వార్థ రాజకీయాలకు వాడుకుందని ప్రత్తిపాటి తెలిపారు. వైసీపీప్రభుత్వం ఆపేసిన పథకాల్ని కూటమిప్రభుత్వం పునరుద్ధరిస్తుందని, దళితుల జీవితాల్లో కొత్తవెలుగులు తీసుకొస్తుందని ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, పెంటేల బాలాజీ, మద్దుమలా రవి, బడుగు జాకోబురాజు, పిల్లి కోటేశ్వరరావు తదితులున్నారు.