

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రాష్ట్రంలో వివిధ జిల్లా పోలీసులు మూడు మాసాల్లో చేధించిన కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఎ.బి.సి.డి. (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డులలో విజయనగరం జిల్లా పోలీసులకు మూడవ స్థానం లభించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏప్రిల్ 16న తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ – డిజిటల్ అరెస్టు కేసును చేధించుటలో విజయనగరం జిల్లా పోలీసులు చక్కని ప్రతిభ కనబర్చారన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు డిజిటల్ అరెస్టు మరియు ఇతర సైబరు నేరాలు గురించి అవగాహన కల్పించాలన్నారు. టెలిగ్రాం యాప్ ద్వారా ప్రజలను మభ్య పెడుతూ, ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని, అటువంటి టెలిగ్రాం గ్రూపులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను రాష్ట్ర డిజిపి ఆదేశించారు. కేసుల దర్యాప్తులో డిజిటల్ అరెస్టు అన్నది లేదని, ఎవరైనా ఈ తరహా నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డిజిపి హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు కమీషన్లకు ఆశ పడి టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా సైబర్ మోసాలకు పాల్పతున్నారని, వారిపై సాంకేతిక ఆధారంగా నిఘా పెట్టాలని, వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మూడు మాసాలకు ఒకసారి వివిధ జిల్లా పోలీసులు చేపట్టిన దర్యాప్తు, చేధించిన కేసుల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన కేసులకు “అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్” అవార్డుకు ఎంపిక చేసి, రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు. 2024సం. నాలుగవ క్వార్టరుకు వివిధ జిల్లాల కేసుల దర్యాప్తును పరిశీలించి, విజయనగరం జిల్లా వన్ టౌన్ పోలీసులు చేధించిన డిజిటల్ అరెస్టు కేసుకు ఎబిసిడి అవార్డుల్లో మూడవ స్థానం లభించిందన్నారు. ఈ కేసులో
క్రియాశీలకంగా పని చేసిన వన్ టౌన్ ఇన్స్పెక్టరు, ఎస్ఐ వి.ఎల్.ప్రసన్న కుమార్, కానిస్టేబులు వై.రామరాజు లతోపాటు కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు దిశా నిర్ధేశం చేసి, ఆయా రాష్ట్రాల పోలీసుల సహాయ, సహకారాలు లభించే విధంగా చర్యలు చేపట్టిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కు రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎబిసిడి అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎబిసిడి అవార్డు అందుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, వన్ టౌన్ ఇన్స్పెక్టరు ఎస్.శ్రీనివాస్, ఎస్ఐ వి.ఎల్.ప్రసన్న కుమార్, కానిస్టేబులు వై.రామరాజు లను రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఈ కేసులో ఫిర్యాది సకాలంలో పోలీసులను ఆశ్రయించడం, నేషల్ సైబరు క్రైం పోర్టల్ ఫిర్యాదు చేయడం వలన నిందితుల ఖాతాల్లోని రూ. 22 లక్షలను ఫ్రీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జమ్ము కాశ్మీర్కు చెందిన ఎ-1 ముమిన్ తారిక్ భట్ ను అరెస్టు చేసామన్నారు. ఎ-1 ముమిన్ తారిక్ భట్ ఇచ్చిన సమాచారంతో వన్ టౌన్ ఇన్స్పెక్టరు ఎస్.శ్రీనివాస్ మరియు ఇతర పోలీసు బృందం మహారాష్ట్ర వెళ్ళి, డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించిందనట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ముఠా టెలిగ్రాం యాప్ ద్వారా గ్రూపుగా ఏర్పడి, దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతూ, పెద్ద మొత్తంలో డబ్బులను దోచుకుంటున్నా రన్నారు. ఎ-2 ఖసిడ్జి చంద్రకాంత్ సుతార్ (24 సం.లు), ఎ-3 క్లెవిన్ గ్లెన్ బ్రిట్టో (21 సం.లు) ఎ-4 నితిన్ నందలాల్ సరోజ్ (23 సం.లు), ఎ-5 సైఫ్ తలమీ దమంద్ (31 సం.లు) అనే మహారాష్ట్రలోని ముంబయి, పూణేకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసారన్నారు. నిందితుల వద్ద నుండి రూ.10 లక్షల నగదు, రూ.9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఆరు మొబైల్ ఫోన్లును సీజ్ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులకు పవర్ పాయింట్
ప్రెజెంటేషను ద్వారా వివరించారు. ఎబిసిడి అవార్డుల్లో వెస్ట్ గోదావరి పోలీసులకు ప్రధమ బహుమతి, సత్యసాయి జిల్లా పోలీసులకు ద్వితియ బహుమతి, విజయనగరం జిల్లా పోలీసులకు తృతీయ బహుమతి, గుంటూరు జిల్లా పోలీసులకు కన్సోలేషను బహుమతి లభించాయి. మంగళగిరిలోని రాష్ట్ర డిజిపి కార్యాలయంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్, ఇంటిలిజెన్సు అడిషనల్ డిజి మహేష్ చంద్ర లడ్డా, మధుసూధన రెడ్డి, ఐజి కే.శ్రీకాంత్, ఆకే రవికృష్ణ, హరికృష్ణ, రవి శంకర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.