



ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడీ క్లీనర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి పై అవగాహన కల్పన
ఎలిగేడు మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్, ఏప్రిల్ 22, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మండలంలోని
పలు ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ఎలిగేడు మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఎలిగేడు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం , లాలపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, ఎంపిపిఎస్ పాఠశాల, సుల్తాన్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నర్సాపూర్ గ్రామంలో ఎంపిపిఎస్ ,ప్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కలెక్టర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలిగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు చేపట్టిన డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు.లాలపల్లి గ్రామంలో చివరి దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ పనులు పూర్తి చేయాలని, పాఠశాలకు పెయింటింగ్ పనులు సైతం ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పని ప్రదేశాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సుల్తాన్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయురాలు వావిలాల సంధ్యా రెడ్డి ను కలెక్టర్ శాలువాతో సత్కరించారు. అక్కడ పూర్తి చేసుకున్న డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. నర్సాపూర్ గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఫ్లోరింగ్, విద్యుత్ పనులు, పేయింటింగ్ పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఎలిగేడు, నర్సాపూర్ గ్రామాలలో ప్యాక్స్ ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా ప్యాడి క్లీనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. శుభ్రం చేసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని, ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. హార్వెస్టర్లతో వ్యవసాయ అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పంటలు పచ్చి మీద ఉన్నప్పుడు కోతలు చేయవద్దని అవగాహన కల్పించాలని అన్నారు. అంతకు ముందు ఎలిగేడు రైతు వేదిక వద్ద భూ భారతి చట్టం పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి పై అవగాహన కల్పించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డి.యం. శ్రీకాంత్ , ఎలిగేడు మండల తహసిల్దార్ బషీర్, ఎంపీడీవో భాస్కర రావు, మండల పంచాయతీ అధికారి కిరణ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.